ఓటుకు నోటు కేసు..ఈడీ ఛార్జిషీట్ దాఖలు

Update: 2021-05-27 15:02 GMT

రేవంత్..సండ్ర వెంకటవీరయ్యలు కుట్రదారులే

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం. ఈ వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ఛార్జి షీట్ దాఖలు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందేందుకు ఎల్విస్ స్టీఫెన్ సన్ కు ఐదు కోట్ల రూపాయాలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారని పేర్కొంది. దీని కోసం అనుముల రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య ఇతరులు కలసి కుట్ర పన్నినట్లు ఈడీ తన ఛార్జి షీట్ లో పేర్కొంది. వీళ్లిద్దరితోపాటు సెబాస్టియన్, మత్తయ్య, వేం కృష్ణకీర్తన్ లపై కూడా అభియోగాలు నమోదు చేశారు. వీరంతా మనీలాండరింగ్ కు పాల్పడ్డారని అభియోగాల్లో నమోదు చేసింది. ఏసీబీ ఛార్జి షీట్ ఆధారంగా విచారణ జరిపిన ఈడీ పీఎంఎల్ఏ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది.

నిందితులతోపాటు సాక్ష్యులతో సహా అందరి స్టేట్ మెంట్లు రికార్డు చేశామని పేర్కొంది. 2015లో వెలుగుచూసిన ఓటుకు నోటు కేసు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈడీ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఎక్కడా కూడా తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పేరు మాత్రం లేదు. ఈ వ్యవహారానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన చంద్రబాబు వాయిస్ రికార్డు పెద్ద సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News