బిఆర్ఎస్ భవిష్యత్ అగమ్య గోచరంగా మారుతున్న వేళ ఒకే రోజు ఆ పార్టీ కి రెండు షాక్ లు తగిలాయి. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బిఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీ లో చేరిపోయారు. చేవెళ్ల ఎంపీ అంటే లోక్ సభ ఎన్నికల షెడ్యూలు కూడా వచ్చినందున అయన పదవి కాలం కూడా ముగిసినట్లే లెక్క. కానీ ఖైరతాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి తో దానం నాగేందర్ భేటీ అయినప్పుడే అయన పార్టీ మారటం ఖాయం అన్న చర్చ సాగింది. అయితే నిన్న కూడా ఈ వార్తలను ఖండించిన అయన 24 గంటలు కూడా గడవక ముందే కాంగ్రెస్ ఖండువా కప్పుకున్నారు. ఎన్నికల షెడ్యూలు వచ్చినందున టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఇక తన రాజకీయం ఏంటో చూపిస్తా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అంటే రాబోయే రోజుల్లో మరింత మంది ఎమ్మెల్యేలతో పాటు బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది అనే చర్చ సాగుతోంది. దీంతో లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కటం ఖాయంగా కనిపిస్తోంది. లోక్ సభా అభ్యర్థులను బరిలో నిలపటానికే బిఆర్ఎస్ పలు సవాళ్లు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కూడా ఆ పార్టీని మరింత ఇరకాటంలోకి నెట్టింది అనే చెప్పాలి.