హైదరాబాద్ లోని మహిళా పోలీస్ స్టేషన్ల నుంచి అందుతున్న సమాచారం షాక్ కు గురిచేసేలా ఉంది. నగరంలో కేవలం 117 రోజుల్లో 1007 కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా నగరంలో మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి కుటుంబాల్లోని వారి మధ్య నెలకొన్న అహంకారం(ఇగో) వల్లే 70 శాతానికిపైగా సమస్యలు వస్తున్నాయని పోలీసు అధికారులు వెల్లడించారు. భార్యా,భర్తల మధ్య గొడవకు చాలా వరకూ చిన్న చిన్న సమస్యలే కారణం అయినా..ఇగో కారణంగా ఎవరూ రాజీపడకపోవటంతో వ్యవహారం విడాకుల వరకూ దారితీస్తుందని తెలిపారు. చాలా వరకూ కౌన్సిలింగ్ ఇస్తున్నా పెద్దగా ఫలితాలు రావటంలేదు. చాలా వరకూ కేసుల్లో ఇగో కారణం అయితే దాని తర్వాత ఎక్కువ సమస్యలు వచ్చేది లింగ వివక్ష వల్లే అని తేల్చారు. ఇద్దరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు..సంపాదన పరంగా ఇద్దరూ బాగానే ఆర్జిస్తారు.
దీంతో ఎవరు ఎక్కువ..ఎవరు తక్కువ అన్న సమస్యలు తెరపైకి వస్తున్నాయని..ఇందులో ఎవరూ కూడా రాజీపడటానికి ముందుకు రాకపోవటం సమస్యల ప్రధాన కారణం అని తేల్చారు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ..ఇంటి పనుల కోసం ఓ మనిషిని పెట్టుకునే వెసులుబాటు ఉన్నా కూడా కొన్ని చోట్ల ఆయా కుటుంబాల్లోని అత్తలు పనులన్నీ కోడలు చేయాలి అన్న చందంగా వ్యవహరించటం కూడా సమస్యలకు కారణాలుగా గుర్తించారు. ఆర్ధిక అంశాలు కూడా వివాదాలకు కారణం అవుతున్నాయి. ప్రధానంగా ఉద్యోగులు అయిన జంటల్లో కొన్ని చోట్ల భర్తలు భార్యలను రకరకాలుగా ఇబ్బంది పెడుతుంటే ..భార్యలు కూడా కొంత మంది భర్తలను ఇబ్బంది పెడుతున్న ఘటనలు నమోదు అవుతున్నాయి. ఇలాంటి కేసులే ఎక్కువగా మహిళా పోలీస్ స్టేషన్లకు వస్తున్నాయి.