హైదరాబాద్ లో సంచలనం రేపిన దిశ ఎన్ కౌంటర్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఔటర్ రింగు రోడ్డు సమీపంలో జరిగిన ఈ రేప్ ఘటన దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ రేప్ కు కారణమైన వారిని గుర్తించిన పోలీసులు తర్వాత ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు రాగా..ఈ ఎన్ కౌంటర్ విచారణకు జస్టిస్ వి ఎస్ సిర్పూర్కర్ కమిషన్ ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ తాజాగా తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది ఇందులో పలు సంచలన అంశాలను ప్రస్తావించింది. ఈ నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు దీన్ని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తున్నామని..అక్కడే నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. సిర్పూర్కర్ కమిషన్ నివేదికను సాఫ్ట్‌కాపీ రూపంలో.. కేసులోని భాగస్వాములందరికీ పంపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నివేదికపై ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పుకోవాలని సూచించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదికను గోప్యంగా ఉంచాలని సీజేఐని లాయర్ శ్యామ్‌దివాన్ కోరారు. అయితే నివేదికలో గోప్యం ఏమి లేదని.. దోషి ఎవరో తేలిపోయిందని సీజేఐ ధర్మాసనం పేర్కొంది. తాము కమిషన్ వేశామని.. కమిటీ హైకోర్టుకు నివేదిక ఇస్తుందన్నారు. దానికి అనుగుణంగానే ముందుకెళ్తామని సీజేఐ వెల్లడించారు.
నివేదిక బయటపెడితే న్యాయవ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని లాయర్ పేర్కొన్నారు. నివేదికను పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు పెట్టకూడదని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు. దేశంలో దారుణమైన పరిస్థితులున్నాయని సీజేఐ పేర్కొన్నారు. ఈ నివేదికను మరోసారి పరిశీలించే ప్రసక్తేలేదని సీజేఐ స్పష్టం చేశారు. దిశా కేసుకు సంబంధించి అన్నిరికార్డులను హైకోర్టుకు సీజేఐ పంపుతామన్నారు. ఈ నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. దిశ ఎన్‌కౌంటర్ బూటకం. పోలీసులే మాన్యువల్‌కు విరుద్దంగా విచారణ జరిపారు. ప్రజల ఆగ్రహాన్ని కట్టడి చేసేందుకే నిందితులను పోలీసులు కాల్చి చంపారు. తక్షణ నాయ్యం కోసమే ఎన్‌కౌంటర్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కాకుండా విచారణ పేరుతో వేరే అధికారులు వారిని వేధింపులకు గురి చేశారు. పోలీసులు గాయాలతో ఆసుపత్రిలో చేరడం ఓ కట్టుకథ అని నివేదికలో పేర్కొన్నట్టు నిందితుల తరఫు లాయర్ ఆరోపించారు. ఈ మేరకు సిర్పూర్కర్ కమిషన్ నివేదికను ఆయన మీడియాకు అందించారు. దిశ కేసులో ఎన్‌కౌంటర్ ఫేక్ అని సిర్పూర్‌కర్ కమిషన్ తేల్చింది.
387 పేజీలతో సిర్పూర్‌కర్ కమిషన్ నివేదికను తయారు చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 10 మంది పోలీసులు పాల్గొన్నారని.. వీరిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారించాలని కమిషన్ పేర్కొంది. పోలీస్ అధికారులు సురేందర్, నరసింహారెడ్డి, షేక్‌లాల్ మదార్, సిరాజుద్దీన్, రవి, వెంకటేశ్వర్లు, అరవింద్‌గౌడ్, జానకీరామ్, బాలురాథోడ్, శ్రీకాంత్ ఈ ఘటనకు పాల్పడ్డారని సిర్పూర్‌కర్ కమిషన్ వెల్లడించింది. అనుమానిత నిందితులను హతమార్చాలన్న ఉద్దేశంతోనే కాల్పులు జరిపారన్నారు. వీరిపై ఐపీసీ 302, 201 ప్రకారం కేసు నమోదు చేయాలని కమిషన్ స్పష్టం చేసింది. ఇవి మూక దాడులు లాంటివే ని పేర్కొన్నారు. .నివేదికలో సిర్పూర్‌కర్ కమిషన్ 16 సిఫార్సులు చేసింది. సత్వర న్యాయం పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని పేర్కొంది. ఇవి మూక దాడులు లాంటివేనని సిర్పూర్‌కర్ కమిషన్ స్పష్టం చేసింది. పోలీసులు శరీరానికి కెమెరాలు తగిలించుకోవాలని తెలిపింది. నేర దర్యాప్తు విభాగాన్ని శాంతిభద్రతల విభాగంతో వేరు చేయాలని సూచించింది.