తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా మేఘా ఇంజనీరింగ్ కంపెనీ పై చేసిన ఆరోపణలు అన్ని ఇన్నీ కావు. బిఆర్ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ప్రధానంగా ఉన్న ఆరోపణలు అడ్డగోలు అవినీతి...అంచనాల పెంపు. ఇదే అంశంపై రేవంత్ రెడ్డి పీసిసి ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ఎన్నో సార్లు మాట్లాడారు. మేఘా ఇంజినీరింగ్ కోసమే అంచనాలు అడ్డగోలుగా పెంచి దోపిడీకి పాల్పడ్డారు అని రేవంత్ రెడ్డి గతంలో విమర్శలు గుప్పించారు. బిఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ డొల్లతనం ఎన్నికలకు ముందే బయటపడింది. ఈ ప్రాజెక్ట్ లో అవినీతికి సంబంధించి కాగ్ కూడా తన నివేదికల్లో ప్రస్తావించింది. సీన్ కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణ కోసం రిటైర్డ్ న్యాయమూర్తి పీసి ఘోష్ తో కమిషన్ వేసినా కూడా ఈ విచారణ పరిధి నుంచి అత్యంత కీలకమైన అంశాలను తప్పించినట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి.
కొంత మంది మంత్రులతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా మేఘా ఇంజనీరింగ్ కంపెనీని కాపాడేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఈ పని చేశారు అని అభిప్రాయపడుతున్నారు. పీసి ఘోష్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించటం..దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవటానికి సోమవారం నాడు ప్రత్యేకంగా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నివేదిక అధికారికంగా ఇంకా బయటకు రాకపోయినా కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో అంతా మాజీ సీఎం కెసిఆర్ చేశారు అనే కోణంలో మీడియా లో వార్తలు వచ్చాయి. కాళేశ్వరం పై విచారణ ప్రారంభించిన తర్వాత కెసిఆర్ మాట మార్చినా సీఎం గా ఉన్న సమయంలో తానే స్వయంగా చెప్పుకున్నారు అంతా తానే చేశాను అని. గత కొద్ది నెలల కాలంలో ఏసీబీ కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల బాధ్యతలు చూసిన ఇంజనీర్ల పై దాడులు చేస్తే ఏకంగా ముగ్గురి దగ్గరే మార్కెట్ విలువ ప్రకారం వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ముగ్గురు ఇంజనీర్లే ఇంత భారీ మొత్తంలో ఆస్తులు కూడబెడితే లక్ష కోట్ల రూపాయల పైబడిన ఈ ప్రాజెక్ట్ కు అనుమతులు ఇచ్చిన వాళ్ళు..అమలు చేసిన కాంట్రాక్టర్లు ఎంత భారీ మొత్తంలో అనుచిత లబ్ది పొందారో అర్ధం చేసుకోవచ్చు అని ఒక సీనియర్ మంత్రి అభిప్రాయపడ్డారు.
ఈ నివేదిక ఆధారంగా అటు కెసిఆర్ తో పాటు ఎవరిపై నేరుగా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉండదు అని...రాజకీయంగా దీన్ని ప్రచారంలో పెట్టడం...మరో విచారణ జరిపి కాలయాపన చేయటానికే ఇది ఉపయోగపడుతుంది అని ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ లో ప్రధాన లబ్ధిదారు అయిన మేఘా ను ఈ విచారణల పరిధి నుంచి తప్పించిన తర్వాత ఇందులో ఎవరిపై అయినా చర్యలు ఉంటాయి అని నమ్మటం కష్టమే అని ఒక సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. మరో వైపు పీసి ఘోష్ కమిషన్ ఆర్థిక శాఖను తప్పుపట్టింది. బిఆర్ఎస్ హయాంలో ఆర్థిక శాఖ ను చూసిన ఐఏఎస్ అధికారి రామకృష్ణా రావు ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా ఉన్నారు. మరి సిఎస్ గా ఉన్న ఆయన తనను తప్పు పట్టిన కమిషన్ రిపోర్ట్ ను ముందుకు పోనిస్తారా...సీఎం రేవంత్ రెడ్డి కమిషన్ తప్పుపట్టిన వాళ్లలో ఎవరు ఉన్నా సరే ముందుకు వెళ్లాల్సిందే అంటారా అంటే సందేహమే అనే సమాధానాలు వస్తున్నాయి. ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే ప్రతిపక్షంలో ఉండగా ఏ కంపెనీ పై అయితే తీవ్ర ఆరోపణలు చేసారో అదే కంపెనీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారులో కూడా కీలకంగా మారింది అని అధికారులు చెపుతున్నారు. బిఆర్ఎస్ హయాంలో విద్యుత్ శాఖలో సాగిన అక్రమాలు...అవినీతి అంశంపై ఏర్పాటు చేసిన మదన్ బి లోకూర్ కమిటీ తన నివేదిక ఇచ్చి కొన్ని నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి చర్యలు లేవు. దీంతోనే ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.