రేవంత్ రెడ్డి అవాస్త‌వాలు ప్ర‌చారం చేయ‌టం స‌రికాదు

Update: 2022-03-03 12:18 GMT

డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి ఆక‌స్మికంగా మెడిక‌ల్ లీవ్ పెట్ట‌డానికి కార‌ణం ఏంటి?. ఆయ‌న ఎక్క‌డా వైద్యం చేయించుకుంటున్న‌ట్లు కూడాలేద‌ని..ప్ర‌భుత్వ ఒత్తిడి మేర‌కే ఆయ‌న సెల‌వులో వెళ్లిన‌ట్లు క‌న్పిస్తోంద‌ని ఇటీవ‌ల టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించిన విష‌యం తెలిసిందే. రేవంత్ ఆరోప‌ణ‌ల‌పై మ‌హేంద‌ర్ రెడ్డి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. తనను ప్రభుత్వం బలవంతంగా సెలవుపై పంపించిందంటూ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు ఏమాత్రం వాస్తవం కాద‌న్నారు. ఇంట్లో జారిపడిన సంఘటనలో ఎడమ భుజం పైన బోన్ (SCAPULA ) కు మూడు చోట్ల Hairline fractures జరిగాయని ఎక్స్ -రే, సి.టీ. స్కాన్, ఎం.ఆర్.ఐ లలో తేలింది. దీనితో, భుజం కదలకుండా కట్టు కట్టడం జరిగింది. విరిగిన బోన్ మానేందుకు పూర్తి స్థాయిలో విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించినందునే ఫిబ్రవరి 18 వ తేదీ నుండి మార్చి 4 వతేదీ వరకు సెలవులో వెళ్లడం జరిగింది. తిరిగి, వైద్యుల సలహా మేరకు విధుల్లో జాయిన్ అవడం జరుగుతుంద‌న్నారు. రోజూ భుజానికి అవసరమైన వ్యాయామం, ఫిజియోథెరపీ, మందులను వాడడం జరుగుతోంద‌ని తెలిపారు.

ఈ వాస్తవాలు తెలుసుకోకుండా తనను ప్రభుత్వం బలవంతంగా సెలవులో పంపించిందంటూ తప్పుడు, భాద్యతా రహిత ప్రచారం చేయడంపట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. ఒక రాష్ట్ర పార్టీ నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేయడం భావ్యం కాదు. తమ రాజకీయ అవసరాలకు ప్రభుత్వ అధికారులపై ఈవిధమైన అసత్య ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఒక ఉన్నత స్థాయిలో, బాధ్యతాయుత హోదాలో ఉన్న సీనియర్ అధికారిపై ఈ విధమైన ఆరోపణలను చేయడం ఆక్షేపణీయమే కాకుండా ప్రభుత్వంపై అపోహలు కలిగే అవకాశం ఉంది. ఈ తప్పుడు ఆరోపణలు పోలీస్ శాఖ స్తైర్యాన్ని దెబ్బతీయడం తోపాటు , రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగే ప్రమాదముంది. భాధ్యతాయుత సీనియర్ అల్ ఇండియా సర్వీసుల అధికారులు, ఇతర అధికారులపై ఆరోపణలు చేసేటప్పుడు విచక్షణ, సంయయనం పాటించాలని కోరుతున్నానని త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

Tags:    

Similar News