ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేంద్ర ఏజెన్సీల దూకుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఎప్పుడు ఎవరి అరెస్ట్ ఉంటుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఈ స్కామ్ లో వరస పెట్టి అరెస్ట్ లు జరుగుతుండటంతో ఈ ప్రభావం తెలంగాణపై ఏ మేరకు ఉంటుందనే అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో ఉంది. ఎందుకంటే ఈ స్కామ్ పథక రచన హైదరాబాద్ తోపాటు ఢిల్లీ వేదికగానే జరిగినట్లు తేలింది. నగరానికి చెందిన పలువురు ఇందులో భాగస్వాములు కావటం..వారి వారి నివాసాల్లో ఐటి, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో లిక్కర్ స్కామ్ కోసం వెతుకుతుంటే కేంద్ర ఏజెన్సీలకు మాత్రం బినామీ లావాదేవీల గుట్టు కూడా రట్టు అయినట్లు సమాచారం. దీంతో కీలక వ్యక్తులు అంతా టెన్షన్ టెన్షన్ తో గడుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బుధవారం నాడు కూడా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు లో అరెస్ట్‌ల పర్వం కొనసాగింది. తాజాగా ఈ స్కామ్‌లో ఈడీ అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు.
లిక్కర్ స్కాంలో కీలక పాత్ర పోషించిన సమీర్ మహేంద్రు ని అదుపులోకి తీసుకున్నారు. ఇండో స్పిరిట్స్ డైరెక్టర్‌గా సమీర్ మహేంద్రు ఉన్నాడు. మంగళవారం నాడు విజయ్ నాయర్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. మరో నిందితుడు సమీర్ మహేంద్రును ఈడీ నేటి తెల్లవారుజామున అరెస్ట్ చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ లో ఏ8గా సమీర్ మహెంద్రు ఉన్నాడు. ఈ స్కామ్ కు సంబంధించి 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసి ఢిల్లీ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు చేరవేసినట్లు సమీర్ మహేంద్రు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ స్కామ వ్యవహారంలో ఢిల్లీలోని ఆప్ సర్కారు..కేంద్రంలోని బిజెపిల మధ్య రాజకీయ విమర్శలకు కారణం అవుతోంది. త్వరలో జరగనున్న గుజరాత్ ఎన్నికలపై ఆప్ ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో తమను నిలువరించేందుకే ఇలా చేస్తున్నారని ఆప్ ఆరోపిస్తోంది.