'కెసీఆర్ విశ్వ‌స‌నీయ‌త‌'కు స‌వాల్ గా మారిన ద‌ళిత బంధు

Update: 2021-09-01 07:20 GMT

ఒక్క స్కీమ్. ఎన్ని మార్పులు. ఎన్ని చేర్పులు. ముందు చెప్పింది ఒక‌టి..త‌ర్వాత చేసేది మ‌రొక‌టి. తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ విశ్వ‌సనీయ‌త‌కు ద‌ళిత బంధు ఓ స‌వాల్ గా మారిన‌ట్లు క‌న్పిస్తోంది. అందుకే ఆయ‌న‌లో ఆ తత్త‌ర‌పాటు. క‌ల‌వ‌రం. మార్పుల మీద మార్పులు. ముందు ద‌ళితుల‌కు ప‌ది లక్షల రూపాయ‌లు ఇస్తాం..ఆ డ‌బ్బును వాళ్లు ఏమైనా చేసుకోవ‌చ్చన్నారు. త‌ర్వాత ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి అనే నిబంధ‌న‌లు తెచ్చారు. ర‌క‌ర‌కాల మార్పులు వ‌చ్చాయి. అంతే కాదు..ముందు హుజూరాబాద్ లో పైల‌ట్ ప్రాజెక్టు అన్నారు. తొలుత రాష్ట్ర‌మంత‌టా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంపిక చేసిన కుటుంబాల‌కు ద‌ళిత బంధు అని ప్ర‌క‌టించారు. ఒక్క హుజూరాబాద్ లో మాత్రం ద‌ళితులు అంద‌రికీ అన్నారు. పైల‌ట్ ప్రాజెక్టు హుజూరాబాద్ లో అని అకస్మాత్తుగా సీఎం ద‌త్త‌త గ్రామం వాసాల‌మ‌ర్రి గ్రామంలో ప‌థ‌కం అమ‌లు చేశారు. ఇప్పుడు హూజూరాబాద్ కు రెండు వేల కోట్ల రూపాయ‌ల నిధులు మంజూరు చేశారు. మ‌ధ్య‌లో బీసీలు, గిరిజ‌నులు కూడా మా ప‌రిస్థితి ఏంటి అంటూ నిల‌దీయ‌టంతో...టీఆర్ఎస్ పార్టీ స‌మావేశంలో మాట్లాడిన కెసీఆర్ తామే 20 ఏళ్లు ఉంటామ‌ని..అంద‌రికీ అమ‌లు చేస్తామ‌న్నారు. ఇప్పుడు కొత్త‌గా మ‌రో ప్ర‌తిపాద‌న‌ను తెర‌పైకి తెచ్చారు. ఇంత చేసినా కూడా ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం క‌ల‌గ‌టం లేద‌నే ఆందోళ‌న అధికార పార్టీ నేత‌ల్లో క‌న్పిస్తోంది. అందుకే ప్ర‌తిసారి ఓ కొత్త ప్ర‌క‌ట‌న చేస్తున్నారు. ఎలాగైనా ఈ స్కీమ్ అంద‌రికీ వ‌స్తుంది అని న‌మ్మించాల‌నే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు.

అందుకే తాజా ప్ర‌క‌ట‌న అన్న చ‌ర్చ సాగుతోంది. తాజాగా స‌ర్కారు ప్ర‌క‌ట‌న‌లోని కీల‌క అంశాలు ఇలా ఉన్నాయి...'ద‌ళిత పథకాన్ని ఒక ఉద్యమం లా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ లో దళితబంధు పథకాన్ని ముందు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో దళితబంధు పథకం అమలు యొక్క లోతు పాతులను, దళిత ప్రజల యొక్క మనోభావాలను, వారి అవసరాలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా.. రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భాగాల్లో వున్న, దళిత శాసన సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాలను ఎంపిక చేసి ఆ మండలాల్లో అన్ని కుటుంబాలకు హుజూరాబాద్ తో పాటు దళితబంధు ను అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

దీనికిగాను.. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం....సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలం....నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం....కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలాలను సిఎం కెసిఆర్ ఎంపిక చేశారు. ఈ 4 మండలాల్లో వున్న అన్ని దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింపచేస్తుంది. సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయా జిల్లాల మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లతో హైద్రాబాద్ లో సమీక్షా సమావేశాన్ని సిఎం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో నిర్ణయాలు తీసుకుని ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేస్తారు.' అని తెలిపారు. ద‌ళిత బంధుపై రెండేళ్ళు క‌స‌ర‌త్తు చేశాను..మా అవిడ అభిప్రాయం కూడా తీసుకున్నాను అని చెప్పిన కెసీఆర్ మ‌ళ్ళీ ఇప్పుడు లోతు పాతులను, దళిత ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఏముంది?.

Tags:    

Similar News