కరోనాపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Update: 2021-04-08 07:58 GMT

రాష్ట్రంలోకి ప్రవేశించే వారి నుంచి ఆర్టీపీసీఆర్ టెస్ట్ కు సంబంధించి నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకోవాలని తెలంగాణ సర్కారును హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో థియేటర్లు, వైన్ షాప్ లు, బార్లు కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్రాలుగా మారాయని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం.. హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఎక్కడ కేసులు ఎక్కువ ఉంటే వాటిని మైక్రో కంటోన్మెంట్‌ జోన్స్ కింద ఎందుకు ప్రకటించలేదని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. ఫంక్షన్‌ హాల్స్‌, మ్యారేజ్ హాల్స్‌ వద్ద ఎక్కువమంది గుమికూడితే అలాంటివారిపై క్రిమినల్ యాక్షన్‌ తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. వ్యాక్సినేషన్‌కు ఎలాంటి ప్రణాళికలు రూపొందించారో చెప్పాలని ప్రభుతాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ఎంత వచ్చింది? ఎంత వేస్టేజ్ అయిందో చెప్పాలని హైకోర్టు పేర్కొంది. పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

తదుపరి విచారణ ఈ నెల 19కి హైకోర్టు వాయిదా వేసింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎంత మందిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. దీనికి సంబంధించి నివేదికలో పొందుపర్చిన నెంబర్లు చాలా తక్కువగా ఉన్నాయని..దీని ప్రకారం నియంత్రణా చర్యలు కూడా సరిగా తీసుకోవటంలేదని భావించాల్సి ఉంటుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఆర్టీ పీసీఆర్ పరీక్షలు 70 శాతానికి పెంచాలని ఆదేశించింది. లాక్ డౌన్ విధించకపోయినా కంటైన్మెంట్ జోన్లను మాత్రం విధిగా అమలు చేయాలని స్పష్టం చేసింది.

Tags:    

Similar News