తెలంగాణ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో సిబిఐ విచారణ కోరటం అంటే తన చేతిలో ఉన్న అధికారాన్ని తీసుకెళ్లి ప్రధాని మోడీ చేతిలో పెట్టినట్లే. ఒక వైపు కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ పదే పదే సిబిఐ, ఈడీ లు బీజేపీ చేతిలో పావులుగా మారాయని విమర్శిస్తున్న తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నాడు అసెంబ్లీ వేదికగా తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. కాళేశ్వరం స్కాం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డబుల్ గేమ్ ఆడుతున్నారు అనే విమర్శలు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఎన్నో సార్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇలా చేసిన ప్రతిసారి సిబిఐ విచారణకు ఇస్తే బీజేపీ కెసిఆర్ ను రక్షించే ప్రయత్నం చేస్తుంది అని గతంలో కాంగ్రెస్ నేతలు అంతా ఆరోపించారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ అదే పని చేసింది. అంతే కాదు టిపీసిసి ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలోనే రేవంత్ రెడ్డి కాళేశ్వరం స్కాం నుంచి రక్షించుకోవటానికి బిఆర్ఎస్ బీజేపీ కి ప్రొటెక్షన్ మనీ ఇస్తోంది అని కూడా ఆరోపించారు. మరి ఇదే నిజంగా అయితే బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పై కెసిఆర్ పై చర్యలు తీసుకుంటుందా?. అలా అని సీఎం రేవంత్ రెడ్డి ఎలా నమ్ముతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణ కమిషన్ ఏర్పాటు సమయంలోనే అవినీతి, అక్రమాల అంశాలను నిగ్గుతేల్చే బాధ్యతను వదిలేసి కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల విషయాలను మాత్రమే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో చేర్చటం తో ఈ ప్రాజెక్ట్ లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ని కాపాడేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఇలా చేశారు అని కొంత మంది మంత్రులు కూడా అనుమానం వ్యక్తం చేశారు. అటు విజిలెన్సు రిపోర్ట్ దగ్గర నుంచి ఇప్పుడు పీ సి ఘోష్ కమిషన్ లో కూడా ఎక్కగా మేఘా ఇంజనీరింగ్ కంపెనీ చేపట్టిన పనుల ప్రస్తావన రాలేదు. ఇది అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి వేసిన స్కెచ్ అన్న ఆరోపణలు కూడా కాంగ్రెస్ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్న తరుణంలో ఇప్పుడు తాపీగా సిబిఐ విచారణ కోరటం అంటే రేవంత్ రెడ్డి సర్కారు బాధ్యతల నుంచి తప్పించుకోవటం తప్ప మరొకటి కాదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒక వైపు అసెంబ్లీ లో కూడా కాళేశ్వరం పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ దిశగా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవటం లేదు. కాంట్రాక్టుల కమిషన్ కోసమే కక్కుర్తి పడ్డారు అని చెపుతూ ఆ కాంట్రాక్టు సంస్థల ను ఈ స్కాం నుంచి మినహాయింపు కల్పించినట్లు కనిపిస్తోంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం స్కాం విచారణ బాధ్యతను ఇప్పుడు సిబిఐ కి అప్పటించటం ద్వారా రాబోయే రోజుల్లో రాజకీయంగా వాడుకోవొచ్చేమో కానీ...రాజకీయంగా ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డికి...కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం తీవ్ర అవమానకర పరిణామం అని కాంగ్రెస్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. జస్టిస్ పీ సి ఘోష్ కమిషన్ తన నివేదికలో మాజీ సీఎం కెసిఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఈటల రాజేందర్ లు దీనికి బాద్యులుగా స్పష్టంగా పేర్కొంది. ఇంత స్పష్టమైన నివేదిక తన దగ్గర పెట్టుకుని చట్టప్రకారం ముందుకు వెళ్లాల్సిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం బంతిని మోడీ సర్కారు కోర్ట్ లోకి నెట్టింది అంటేనే దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.