తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పై బిజెపి మరింత దూకుడు పెంచనుంది. తమ తదుపరి టార్గెట్ జాబితాలో తెలంగాణ కూడా ఉందని బిజెపి నేతలు పదే పదే చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల ఫలితాల అనంతరం ఆ పార్టీలో జోష్ పెరగటం సహజమే. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, సీఎం కెసీఆర్ వైఖరి ఎలా ఉండబోతుంది?. ఇంత కాలం బిజెపిపై, ప్రధాని నరేంద్రమోడీపై విమర్శల విషయంలో దూకుడు చూపించిన కెసీఆర్ ఇకపై కూడా అదే ఊపు కొనసాగిస్తారా?. లేక మారిన పరిస్థితుల్లో మౌనాన్ని ఆశ్రయిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. గత కొంత కాలంగా ఛాన్స్ దొరికినప్పుడల్లా కెసీఆర్, మంత్రి కెటీఆర్ లు బిజెపి, కేంద్ర సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలతో దేశానికి ప్రత్యామ్నాయ మార్గం చూపుతామని సీఎం కెసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే కెసీఆర్ ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్థవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తమిళనాడు సీఎం స్టాలిన్, తాజాగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. దేశంలో పాలన సరిగాలేదని..దీన్ని మార్చాల్సిన అవసరం ఉందని కెసీఆర్ ఈ మధ్య పదే పదే మాట్లాడుతున్నారు.
దేశం నుంచి బిజెపి, మోడీని తరిమికొట్టాలని పిలుపునిచ్చిన కెసీఆర్ ఆకస్మాత్తుగా జార్ఖండ్ లో మాత్రం తమది యాంటీ బిజెపి, యాంటీ కాంగ్రెస్ ఫ్రంట్ కాదంటూ కొత్తపల్లవి అందుకున్నారు. ఇప్పుడు దేశ పరిపాలనలో మార్పులు రావాల్సిన అవసరం ఉందనే కొత్త పల్లవి అందుకున్నారు. ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడైన తర్వాత...యూపీ తోపాటు ఇతర రాష్ట్రాల ఫలితాల విషయంలో కెసీఆర్ కు అందిన నివేదికల ఆధారంగానే ఆకస్మాత్తుగా ఈ నెల8న వనపర్తి సభలో నిరుద్యోగ యువత మార్చి9 ఉదయం పది గంటలకు టీవీలు చూడాలంటూ ప్రకటన ఇచ్చారని..ఈ పలితాలు వెల్లడైన అనంతరం ఈ ప్రకటన చేస్తే అది రాజకీయంగా అంతగా కలసి రాదనే ఉద్దేశంతోనే ఇలా చేశారని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. బిజెపిపై ఎవరెంత వ్యతిరేక ప్రచారం చేసినా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఎక్కడా ఆ ప్రభావం పెద్దగా కన్పించలేదు.
దేశాన్ని అమ్ముతున్నారని...పెట్రో దరలు అడ్డగోలుగా పెంచుతున్నారని..రైతులను దెబ్బతీసేలా నల్లచట్టాలు తెచ్చారంటూ బిజెపిపై పలు పార్టీలు ఎటాక్ చేశాయి..చేస్తున్నాయి కూడా. కానీ తాజాగా వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆ ప్రభావం పెద్దగా ఎక్కడా పడినట్లు కన్పించటంలేదు. అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ లో బిజెపి అధికారాన్ని నిలబెట్టుకుంది. గతం కంటే సీట్లు కాస్త తగ్గినా సుస్థిరపాలనకు అవసరమైన సీట్లు ఆ పార్టీకి దక్కాయి. ఇదే జోష్ తో బిజెపి తెలంగాణలోనూ స్పీడ్ పెంచనుంది. అంతే కాదు..ఐదు రాష్ట్రాల ఫలితాల అనంతరం కేంద్ర సర్కారు తనదైన శైలిలో అధికార పార్టీ నేతలకు ఝలక్ ఇవ్వటం ఖాయం అని ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఆ పని వెంటనే చేస్తారా? లేక కొంత టైమ్ తీసుకుంటారా అన్నది వేచిచూడాల్సిందే. ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల వేడి పెరిగింది. తాజాగా వెల్లడైన ఐదు రాష్ట్రాల ఫలితాల అనంతరం ఇది మరింత పెరగటం ఖాయంగా కన్పిస్తోంది. ఈ ఫలితాల్లో దారుణ ఓటములను చవిచూసిన కాంగ్రెస్ పై కూడా ఆ ప్రభావం పడటం ఖాయంగా కన్పిస్తోంది.