తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ రాష్ట్రంలోని మీడియాకు షాకిచ్చారు. ప్రధాని మోడీ పర్యటనకు సీఎం కెసీఆర్ దూరంగా ఉంటారనే సంకేతాలు శనివారం నాడే స్పష్టంగా వెల్లడయ్యాయి. దీనిపై కొన్ని మీడియా సంస్థల్లోనూ వార్తలు వచ్చాయి. కానీ సీఎం కెసీఆర్ శనివారం ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఆయన స్వాగత కార్యక్రమంతోపాటు ప్రధాని పాల్గొనే ఇక్రిశాట్, రామానుచార్య విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లోనూ పాల్గొంటారని లీకులు ఇప్పించారు. దీంతో ఈ వార్తలను ఛానళ్ళు, పత్రికల్లు అదేదో చాలా ప్రత్యేక విశేషంగా ప్రసారం చేసి..ప్రచురించారు. వాస్తవానికి ప్రధాని పర్యటనలో సీఎం పాల్గొనటం అనేదాంట్లో ఎలాంటి ప్రత్యేకత లేదు. ప్రధాని రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి ప్రొటోకాల్, సంప్రదాయం ప్రకారం స్వాగతం పలుకుతారు. ఆయన వెంటే స్థానికంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఇది అత్యంత సహజంగా జరిగే వ్యవహారం. కానీ సీఎం కెసీఆర్ ఏదో అసాధారణ నిర్ణయం తీసుకున్న తరహాలో ప్రత్యేకంగా దానికి ప్రాధాన్యత ఇచ్చారు. శనివారం మధ్యాహ్నం వరకూ అధికారిక క్యాంప్ నుంచి సీఎం కెసీఆర్ ఓ పెళ్ళికి హాజరై అక్కడ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతారు అంటూ వార్తలు వచ్చాయి. కానీ అసలు సమయం వచ్చేసరికి జ్వరం కారణంగా సీఎం కెసీఆర్ ప్రధాని మోడీ స్వాగత కార్యక్రమానికి దూరంగా ఉన్నారంటూ తేల్చటంతో షాక్ కు గురవటం మీడియా వంతు అయింది. విషయం తెలిసి కూడా పలు ప్రధాన పత్రికలు అధికారులు ఇచ్చిన లీక్ ల ట్రాప్ లో పడిపోయి బుక్ అయ్యాయి.