హైదరాబాద్ లో మంగళవారం రాత్రి జరిగిన కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. కిడ్నాప్ కు గురైంది తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు సమీప బంధువు కావటంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి సమీప బంధువులైన మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు(51), సునీల్‌రావు(49), నవీన్‌రావు (47)లను కొందరు దుండగులు మంగళవారం కిడ్నాప్ చేశారు. రాత్రి 7.30 సమయంలో ఐటీ అధికారుల మంటూ వీరి ఇంట్లోకి ప్రవేశించారు. తర్వాత ముగ్గురినీ అక్కడ నుంచి బల వంతంగా తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న నార్త్ జోన్ డీసీపి కల్మేశ్వర్, సెంట్రల్ జోన్ డీసీపీ అక్కడికి చేరుకున్నారు.
డైమండ్ పాయింట్, రాణిగంజ్ మీదుగా రెండు అనుమానిత వాహనాలు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. హఫీజ్‌పేట భూవివాదానికి సంబంధించే ఈ కిడ్నాప్ జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ కవిత అక్కడకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. కిడ్నాప్‌కు గురైన ముగ్గురు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. కిడ్నాపర్లు నార్సింగ్ వద్ద బాధితులను వదిలేసి పరారు అయ్యారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రెండు వాహనాలను పట్టుకున్నారు. కీలక నిందితుడు చంద్రబోస్‌తోపాటు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు.