తెలంగాణలో గత కొన్ని రోజులుగా డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఇందులో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారన్న సమాచారం మరింత దుమారానికి కారణం అవుతోంది. సోషల్ మీడియాలో కూడా దీనిపై విస్తృత చర్చ సాగుతోంది. అయితే దీనిపై అధికార పార్టీ నేతలు ఎవరూ నోరు విప్పటం లేదు. ఇదే అదనుగా బిజెపి అధికార టీఆర్ఎస్ పై విమర్శల దాడి ప్రారంభించింది. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు డ్రగ్స్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలే కాదు..ఇందులో ఓ మంత్రికి కూడా పాత్ర ఉందని ఆయన ఆరోపించారు.
డ్రగ్స్ కేసులో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరో సీఎం కేసీఆర్‌కు తెలుసని.. వారికి డ్రగ్స్ టెస్ట్ లు చేయించే దమ్ముందా అని సవాల్ విసిరారు. ''అసెంబ్లీలో కరోనా టెస్ట్ లకు బదులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డ్రగ్స్ టెస్ట్ లు చేయాలి. కర్ణాటక డ్రగ్స్ కేసులో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరో కేసీఆర్‌కు తెలుసు. వారితో వెంటనే రాజీనామా చేయించాలి. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డ్రగ్స్ దందా చేస్తున్నారు. డ్రగ్స్ టెస్ట్‌కు నేను సిద్ధంగా ఉన్నా. మీ ఎమ్మెల్యేలు బ్లడ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా?.'' అని బండి సంజయ్ అన్నారు.