తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్ ) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ ఎన్నికల వ్యూహకర్తలకు సంబంధించిన అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కెసీఆర్ ప్రశాంత్ కిషోర్ ను మించిన వ్యూహకర్త అని వ్యాఖ్యానించారు. వ్యూహకర్తలు సీఎంలను తీసిపెట్టలేరని అన్నారు. ప్రశాంత్ కిషోర్ ఏదో ఆకాశం నుంచి ఏదో తీసుకొస్తారన్న నమ్మకం లేదన్నారు. పీకె కాంగ్రెస్ లో చేరితే ఏమి చేయాలో అప్పుడు ఆలోచిస్తామని తెలిపారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో వ్యూహకర్తలతో కలసి వచ్చేది పరిమితంగానే ఉంటుందని కెటీఆర్ అభిప్రాయపడ్డారు.
గత ఎనిమిది సంవత్సరాలుగా మీడియా ముందుకురాని..ఒక్కసారి కూడా విలేకరుల సమావేశం పెట్టని ప్రధాన మంత్రి దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క మోడీ మాత్రమే అని ఎద్దేవా చేశారు. ఆయన ఎందుకు మీడియా ముందుకు రాలేరని ప్రశ్నించారు. మోడీ చెప్పేది గాంధీ సూక్తులు..చేసేవి గాడ్సే పనులు అని వ్యాఖ్యానించారు. ఈ మాటలు అన్నందుకు గుజరాత్ లో ఓ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారని..చేతనైతే తనను కూడా అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. బిజెపికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఈడీ, సీబీఐలతో బెదిరించటం వీరికి అలవాటు అయిందని అన్నారు. తాము తప్పులు చేయలేదని..ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు.