అనుమతి తీసుకున్నది ఒక దానికి. కానీ అద్దెకు ఇచ్చింది మరొదానికి. చేతిలో మీడియాలో ఉంది. ప్రభుత్వ పెద్దల అండ ఉంది. ఎన్ని అక్రమాలు చేసినా మనకేమీ అవుతుందిలే అన్న ధీమా. సొసైటీ సభ్యులు అందరికీ చెందిన ఉమ్మడి ఆస్తులను అదేదో సొంత ఆస్తిలా వాడేశారు. కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఒక్క లీజులోనే ఏకంగా 30 కోట్ల రూపాయల పైనే అక్రమాలు జరిగాయంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. జీహెచ్ఎంసీలో కన్వెన్షన్ సెంటర్ కోసం అని అనుమతులు తీసుకున్నారు. కానీ లీజు దగ్గరకు వచ్చేసరికి మాత్రం గ్రీన్ కో సంస్థ కార్పొరేట్ ఆఫీస్ కు ఇచ్చేశారు. అది కూడా కారుచౌక రేటుకు. సొసైటీ నిబందనల ప్రకారం 20 కోట్ల రూపాయల రుణం తీసుకోవాలంటే సర్వసభ్య సమావేశం నిర్వహించి అందరి ఆమోదంతోనే ఈ పని చేయాలి. కానీ అప్పటి ప్రెసిడెంట్ తమ్మల నరేంద్రచౌదరి, అప్పటి కార్యదర్శి హనుమంతరావులు ఇదేదో తమ ప్రైవేట్ వ్యవహారం అన్నట్లు సొంతంగా నిర్ణయం తీసుకుని 20 కోట్ల రూపాయల రుణం తీసేసుకున్నారు.
ఆ నిర్మాణ కాంట్రాక్ట్ ను కనీసం ప్రకటన ఇవ్వకుండా తమకు నచ్చినవారికే ఇచ్చేశారు. అంతే కాదు సొసైటీకి చెందిన వేల గజాల స్థలాలను అస్మదీయులకు అడ్డగోలుగా అప్పగించేసి తెరవెనక కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారు. ఇప్పటికే ఉన్న భవనాల లీజులను కూడా బినామీ పేర్లతో తీసుకుని నెలానెలా భారీ ఎత్తున ఆర్జిస్తున్నారు. జూబ్లిహిల్స్ లో వాణిజ్య పరంగా ఉపయోగపడే ప్రాంతాలను కూడా అతి తక్కువవ రేట్లకు అద్దెకు ఇచ్చారు. అదే తమ సొంత స్థలాలు...భవనాలు అయితే ఇలాగే చేస్తారా? అంటూ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. డెవలప్ మెంట్ కు ఇచ్చిన వాటిలోనూ అదే తీరుగా అక్రమాలు సాగినట్లు గుర్తించారు. ఒప్పందాలు రద్దు అంటే మళ్ళీ న్యాయపోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తోందని సభ్యులు వాపోతున్నారు.