ఢిల్లీ లిక్కర్ స్కాములో ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత iస్టేట్ మెంట్ రికార్డు చేసే తేదీ, సమయం ఫిక్స్ అయింది. ఎమ్మెల్సీ కవిత సూచించిన తేదీల్లో ఒక దాన్నే సిబిఐ అధికారులు ఖరారు చేశారు. దీని ప్రకారం డిసెంబర్ 11 న సిబిఐ కవిత నుంచి వివరణ తీసుకోవటంతో పాటు ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేయనున్నారు. వాస్తవానికి సిబిఐ అధికారులు మంగళవారం నాడు ఆమె నివాసంలో వివరణ తీసుకోవాల్సి ఉన్నా ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా తాను అందుబాటులో ఉండనని..అదే సమయంలో కొన్ని తేదీలను ప్రస్తావిస్తూ సిబిఐ అధికారులకు లేఖ రాశారు. కవిత చెప్పిన తేదీల్లో ముందు ఉన్న డిసెంబర్ 11 ను ఖరారు చేశారు.
వివరణ ఇవ్వటం కోసం ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో తన నివాసంలో అందుబాటులో ఉంటానని, అందులో అనువైన రోజున తనతో సమావేశం కావచ్చని సిబిఐ కి కవిత లేఖ రాసిన విషయం తెలిసిందే. కవిత లేఖ కు సిబిఐ స్పందిస్తూ ఈమెయిల్ ద్వారా సమాధానం ఇచ్చింది. 11వ తేదీన హైదరాబాద్ లోని కవిత నివాసంలో 11 గంటలకు భేటీ అవుతామని సీబీఐ తెలిపింది. లిక్కర్ స్కాం ఎఫ్ ఐ ఆర్ లో తన పేరులేదని కవిత తన లేఖలో ప్రస్తావించారు. అయితే ఇటీవల అరెస్ట్ అయినా అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం ఈడీ కవిత సౌత్ లాబీ తరపున వంద కోట్ల ముడుపులు ఇచ్చే దానిలో ఉన్నట్లు చెపుతూ...దీనికి సంబంధించి రెండు నంబర్లు, పది ఫోన్లను ధ్వంసం చేసినట్లు పేర్కొన్న విషయం విదితమే. కవిత నుంచి వివరణ తీసుకుని...స్టేట్ మెంట్ రికార్డు చేసిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారనుంది.