కేటీఆర్ లో బయటపడుతున్న కొత్త కొత్త షేడ్స్

Update: 2023-11-02 07:36 GMT

Full Viewకేటీఆర్. బిఆర్ఎస్ తరపున భవిష్యత్ ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న నాయకుడు. ఒకప్పుడు ఆయనకు ముఖ్యంగా పట్టణ యువతలో మంచి ఇమేజ్ ఉన్న మాట వాస్తవం. అయితే క్రమక్రమంగా అయన తన క్రెడిబిలిటీ(విశ్వసనీయత)ని పోగొట్టుకుంటున్నట్లు సొంత పార్టీ నాయకులే అభిప్రాయపడుతున్నారు. ఉన్నత విద్యావంతుడు అయి ఉండి కూడా ఫక్తు రాజకీయ నాయకుడి మాదిరిగా అబద్దాలు చెప్పటం...ప్రత్యర్థులపై నిరాధారమైన ఆరోపణలు చేయటంలో ఇప్పుడు కేటీఆర్ కూడా అందరిలాగానే వ్యవరిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ బిఆర్ఎస్ ఎంపీ, ఆ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై జరిగిన కత్తి దాడి. ఎవరు చేసినా..ఎందుకు చేసినా..ఖచ్చితంగా ఈ దాడిని ఖండించాల్సిందే. కానీ ఈ దాడి జరిగిన గంటల వ్యవధిలోనే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రభుత్వంలో కీలక శాఖలు చూస్తున్న మంత్రిగా ఉన్న కెటిఆర్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ గూండా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నం చేశారు అని ఆరోపించారు. దీనికి సంబంధించి ఫోటోలు కూడా పెట్టారు. ఈ హత్యాయత్నం నెపాన్ని కాంగ్రెస్ పై నెట్టటానికి మంత్రి కేటీఆర్ తన వంతు ప్రయత్నం చేశారు. అసలు ఇందులో నిజ నిజాలు ఏమిటో తెలుసుకోకుండానే ఆయనే తీర్పు ఇచ్చేశారు. అయితే వ్యవహారం ఇప్పుడు రివర్స్ కొట్టింది. తాజాగా ఈ ఘటనపై మీడియా తో మాట్లాడిన సిద్ధిపేట సిపీ శ్వేతా సంచలనం కోసమే రాజు అనే వ్యక్తి ఎంపీ పై దాడికి పాల్పడినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిపారు. సాంకేతిక ఆధారాలతో అన్ని కోణాల్లో దీనిపై విచారణ జరుగుతుంది అని తెలిపారు. మరి ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా..బాధ్యత గల మంత్రిగా ఉండి ఎన్నికల సమయంలో ఒక ఎంపీ పై జరిగిన హత్యాయత్నాన్ని అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీపై నెట్టేసి రాజకీయ లబ్ధిపొందాలని కెటిఆర్ చూసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే కెటిఆర్ తెలంగాణ లో జరిగిన టిఎస్ పీఎస్ సి పేపర్ లీక్ ఘటనలపై విమర్శలు రాగా ...వీటితో తనకు ఏమి సంబంధం అని అప్పటిలో ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం టిఎస్ పీఎస్ సి బోర్డు ను పునర్ వ్యవస్థీకరిస్తామని ,జాబ్ క్యాలెండరు విడుదల చేస్తామని చెపుతున్నారు. ఒకరిద్దరు చేసిన తప్పులకు ప్రభుత్వానికి ఎలా ఆపాదిస్తారు అని అప్పట్లో ప్రశ్నించారు. తర్వాత ఇదే కేసు లో పెద్ద సంఖ్యలో అరెస్ట్ లు జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు సంబంధం లేని టిఎస్ పీఎస్ సి విషయంపై ఇప్పుడు మరి అలవోకగా ఎలా ప్రకటనలు చేస్తున్నారు.

                         అంటే ఎన్నికల్లో ఎలాగోలా యువతను నమ్మించేందుకు ఈ తిప్పలు అన్న మాట. కేటీఆర్ లో ఉన్న డిఫరెంట్ షేడ్స్ కూడా ఈ మధ్య వరసగా బయటపడుతున్నాయి. ఇటీవల ఖమ్మంలో దివంగత ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన కేటీఆర్ మాట్లాడుతూ తారక రామారావు అనే పేరు లోనే ఏదో వైబ్రేషన్ ఉంది అని... ఈ పేరు ఉన్న తాను ఇప్పటికే రెండు సార్లు మంత్రి అయినట్లు వ్యాఖ్యానించారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదు..ఇది అవసరం కోసం మాట్లాడిన మాటలు అనే విషయం తర్వాత బయటకు వచ్చింది. అది ఎలా అంటే గతంలో ఒకసారి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్న కెటిఆర్ తనకు ఈ పేరు ఏ మాత్రం ఇష్టం లేదు అని...పేరు మార్చమని తన తాతతో గొడవపడినట్లు అందులో చెప్పటం కేటీఆర్ డబల్ స్టాండర్డ్స్ కు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉంటే దగ్గర దగ్గర లక్ష కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వరసగా వెల్లడవుతున్న లోపాలను కూడా మంత్రి కేటీఆర్ చాలా తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ముందు ఇందులో కుట్ర కోణం అన్న అంశాన్ని తెరపైకి తెచ్చారు..కానీ తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే మంత్రి కేటీఆర్ చెప్పినట్లు డిజైన్ల లోపం కారణంగా వచ్చిన ఈ సమస్యలకు ఏ నిర్మాణ కంపెనీ కూడా బాధ్యత వహించదు అని ఇంజనీరింగ్ నిపుణులు చెపుతున్నారు. కానీ కేటీఆర్ మాత్రం ప్రభుత్వం పై భారం లేకుండా వెలుగులోకి వచ్చిన లోపాలను ఆయా కంపెనీలే సరి చేస్తాయని చెప్పుకుంటూ వస్తున్నారు. అసలు ఇంత ప్రతిష్టాత్మకమైన నిర్మించిన ప్రాజెక్ట్ నిండా ఐదేళ్లు కూడా పూర్తి చేసు కోకుండానే భారీ లోపాలు బహిర్గతం కావటం అన్న దానిపై మాత్రం కెటిఆర్ సైలెంట్ గా ఉంటారు. ఇలా ప్రతి విషయంలో అబద్దాలు చెప్పుకుంటూ పోతే రేపు రేపు నిజాలు చెప్పినా అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది అని బిఆర్ఎస్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. 

Tags:    

Similar News