అధికారంలో ఉన్నప్పుడు అవే మాటలు. అధికారం పోయిన తర్వాత కూడా అవే మాటలు. ఇవి చూసిన వాళ్ళు అంతా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సవాళ్లు ఇప్పటిలో ఆగవా అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా కేటీఆర్ ఇలాగే ఈడీ, మోడీ, సిబిఐ ఎవరిని పంపిస్తావో పంపు...మమల్ని ఏమీ పీకలేరు అంటూ బహిరంగ సభల్లోనూ..మీడియా ముందు పదే పదే సవాళ్లు విసిరారు. కేటీఆర్ సవాళ్లు విసిరిన వెంటనే ఏమీ కాలేదు కానీ...ఎన్నికల్లో ఓటమి పాలు అయిన తర్వాత ఎప్పటి నుంచో సాగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాం లో మాజీ సీఎం కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె ఏకంగా తీహార్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అధికారంలో ఉన్నంతకాలం అసలు తాము తప్పేమి చేయలేదు అని...తమను ఎవరూ ఏమీ చేయలేరు అంటూ బీరాలు పలికిన కేటీఆర్ ఇప్పుడు మాత్రం కవిత అరెస్ట్ తర్వాత రాజకీయ కక్షతోనే ఢిల్లీ లిక్కర్ కేసు లో కవిత అరెస్ట్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారం ఇలా సాగుతున్న వేళ కూడా ఇంకా కేటీఆర్ ఏ మాత్రం పీకుడు భాష దగ్గర నుంచి వెనక్కి తగ్గటం లేదు. తెలంగాణ సర్కారు పెద్ద ఎత్తున గత ప్రభుత్వ హయాంలో సాగిన టెలిఫోన్ ట్యాపింగ్ విషయాలను వెలికితీస్తోంది.
ఇందులో రోజురోజుకూ సంచనల విషయాలు బయటకు వస్తున్నాయి. అంతిమంగా ఇది ఎవరి మెడకు చుట్టుకుంటుందో...ఎవరి దగ్గర ఆగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికే లక్ష కోట్ల రూపాయల డొల్ల కాళేశ్వరం ప్రాజెక్ట్, ధరణి దందాలు...కొత్త సచివాలయం అంచనాలు పెంపు... దోపిడీ, టెండర్లు లేకుండానే సచివాలయం కోసం చేసిన కోట్ల రూపాయల ఐటి కొనుగోళ్లు, హెచ్ ఎండి ఏ లో సాగిన అడ్డగోలు దోపిడీ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా కూడా ఎక్కడ ఆగుతుందో తెలియటం లేదు. అయినా సరే కేటీఆర్ ఇంకా తమను ఎవరూ ఏమీ పీకలేరు అంటూ సవాళ్లు విసురుతున్నారు. ఈ విచారణలు అన్ని పూర్తి అయితే కానీ...ఎవరి మెడకు ఏమీ చుట్టుకుంటుందో చూడాలి. హైదరాబాద్ ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ దీర్ఘకాలిక లీజ్ దక్కించుకున్న ఐఆర్ బి ఇన్ఫ్రా ఎన్నికల బాండ్స్ ద్వారా అప్పటి అధికార బిఆర్ఎస్ కు 25 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చింది. ఇలా తెలంగాణ ప్రభుత్వం నుంచి భూ కేటాయింపులు పొందిన ...ఇతర ప్రయోజనాలు దక్కించుకున్న సంస్థలు అన్ని కూడా బిఆర్ఎస్ కు కోట్ల రూపాయల మేర నిధులు సమకూర్చినట్లు ఎన్నికల బాండ్స్ లెక్కలు బహిర్గతం చేశాయి. అయినా సరే కేటీఆర్ మాత్రం తాము, తమ పార్టీ నిప్పు అని చెప్పుకుంటున్నారు.