ఆదర్శ పాలనలో ఇలా జరుగుతాయా?!

Update: 2024-04-13 04:57 GMT

లక్ష కోట్ల రూపాయలు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగి..డ్యామ్ కు పగుళ్లు వస్తే అది ఒక చిన్న సమస్య. దేశంలో ఎక్కడా బ్యారేజీలు కుంగలేదా...పగుళ్లు రాలేదా అంటూ ఎదురుదాడి. కట్టిన ఐదేళ్లలోనే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే సమాధానం ఉండదు. లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన టిఎస్ పీఎస్ సి పేపర్ల లీక్ గురించి మాట్లాడితే ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఎన్ని సార్లు పేపర్లు లీక్ కాలేదు..కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పేపర్లు లీక్ కాలేదా?. ఇది మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ స్పందించిన తీరు. మరో వైపు దేశానికే తమ పాలన ఆదర్శం అని చెప్పుకుంటూ ...ఆదర్శ పాలనలో ఇలా ప్రాజెక్ట్ లు దేనికి పనికి రాకుండా పోతాయా...పేపర్ లీక్ లు ఉంటాయా అంటే ఒకటే సమాధానం. దేశంలో ఎక్కడా జరగలేదా అని. ఇప్పుడు తెలంగాణ లోనే కాకుండా దేశంలో కూడా దుమారం రేపుతున్న ట్యాపింగ్ విషయంలో కూడా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే ఫార్ములా ను తెరమీదకు తీసుకువచ్చారు. శుక్రవారం రాత్రి టీవీ 9 డిబేట్ లో పాల్గొన్న కేటీఆర్ అత్యంత కీలకమైన విషయం అయిన ట్యాపింగ్ కు కూడా పాత ఫార్ములా నే వాడారు. దీని కోసం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక సందర్భంలో మాట్లాడిన మాటల వీడియో ను కూడా ప్రదర్శించారు. దీంతో పాటు గతంలో పత్రికల్లో వచ్చిన కొన్ని క్లిప్పింగ్ లకు కూడా పట్టుకొచ్చారు. అయితే అటు కేంద్రం అయినా..రాష్ట్రాలు అయినా కూడా దేశ భద్రత, ఉగ్ర ముప్పులు, ఇతర సవాళ్ల ను ఎదుర్కోవటానికి ఖచ్చితంగా నిఘా పెడతాయి. ట్యాపింగ్ చేస్తాయి. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇందులో ఎలాంటి సందేహం లేదు.

                                         కానీ ఆ ట్యాపింగ్ లకు తెలంగాణ లో జరిగిన ట్యాపింగ్ కు అసలు పోలిక ఉందా?. ఇప్పటి వరకు బయటకు వచ్చిన విషయాలు చూస్తే గత బిఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ ను పూర్తిగా రాజకీయ కోణంలో వాడటమే ఇక్కడ అత్యంత కీలకమైన అంశం. ప్రతిపక్ష పార్టీ ల నేతల తో పాటు సొంత పార్టీ కి చెందిన అనుమానం ఉన్న నేతల విషయంలో కూడా ట్యాపింగ్ జరిగినట్లు అరెస్ట్ అయిన అధికారులు చెప్పినట్లు సమాచారం బయటకు వచ్చింది. అయితే మంత్రి కేటీఆర్ మాత్రం ట్యాపింగ్ తో తనకు ఏ మాత్రం సంబంధం లేదు..తాను ఏ పరీక్షకైనా సిద్ధం అని చెప్పారు తప్ప....తమ ప్రభుత్వ హయాంలో అసలు రాజకీయ ట్యాపింగ్ జరగలేదు అని చెప్పకపోవటం విశేషం. లీక్ లు కాదు ...ఆధారాలు ఉంటే కోర్ట్ ముందు పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు కూడా భట్టి, పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫోన్లు ట్యాప్ చేస్తుంది అని ఆరోపించారు. ఈ విషయంలో కూడా ఆయన కాళేశ్వరం, పేపర్ లీక్ విషయంలో వాడిన ఫార్ములా నే ఉపయోగించినట్లు కనిపిస్తోంది. ట్యాపింగ్ అయినా..ఏ విషయంలో అయినా విచారణ పర్ఫెక్ట్ గా జరిగి చర్యలు తీసుకోవటానికి కొంత సమయం పడుతుంది అని..కాంగ్రెస్ సర్కారు వచ్చి ఇంకా నిండా ఐదు నెలలు కూడా కాకముందే కేటీఆర్ దమ్ముంటే చర్య లు తీసుకోండి..చర్యలు తీసుకోండి అని సవాళ్లు విసురుతున్నారు అంటే ఆయనకు ఈ విషయంలో చాలా తొందర ఉన్నట్లు ఉంది అని ఒక అధికారి వ్యాఖ్యానించారు. తెలంగాణ లో కలకలం రేపుతున్న ట్యాపింగ్ విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు ఎన్ని సంచలన విషయాలు బహిర్గతం చేసి...ఎవరిపై చర్యలు తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News