ఇప్పటికే పార్టీని వీడిన మహారాష్ట్ర నేతలు

Update: 2024-10-15 10:47 GMT

అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా రాజకీయంగా ఛాన్సులు కొంత మెరుగ్గా ఉంటాయి. కానీ ప్రతిపక్షంలో ఉండి కూడా పక్క రాష్ట్రంలో ప్రభావం చూపించగలిగితే ఆ కిక్ వేరు గా ఉంటుంది. బిఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆర్థిక వనరుల పరంగా ఆ పార్టీకి ఢోకా లేదు. ఎందుకంటే బిఆర్ఎస్ బ్యాంకు ఖాతాల్లోనే అధికారికంగా వందల కోట్ల రూపాయలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ని బిఆర్ఎస్ గా మార్చిన తరువాత ఆ పార్టీ అధినేత కెసిఆర్ ఎక్కువగా ఫోకస్ పెట్టింది మహారాష్ట్రపైనే. అక్కడ పలు బహిరంగ సభలు నిర్వహించటంతో పాటు కెసిఆర్ తన పార్టీ నాయకులతో కలిసి హైదరాబాద్ నుంచి భారీ ర్యాలీగా కూడా మహారాష్ట్ర వెళ్లిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మంగళవారం నాడు షెడ్యూల్ విడుదల అయింది. 288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో ఒకే దశలో నవంబర్ 20 న పోలింగ్ జరగనుంది. కౌంటింగ్ నవంబర్ 23 న జరపనున్నారు. మరి కెసిఆర్ ముందు చెప్పినట్లు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతారా లేదా అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం. రాజకీయంగా బిఆర్ఎస్ అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి కూడా ఇదే సరైన సమయం అనే అభిప్రాయాన్ని కూడా కొంత మంది నేతలు వ్యక్తం చేస్తున్నారు . ఎందుకంటే ఇప్పటికిప్పుడు తెలంగాణాలో చేయగలిగింది ఏమి లేదు.

                                             పార్టీ పేరు మార్చినందుకు అయినా ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల బరిలో నిలిస్తే బిఆర్ఎస్ ప్రభావం అక్కడ ఎంత మేర ఉన్నది అన్న విషయం తేలుతుంది. రాజకీయంగా బిఆర్ఎస్ కు ఇది ఒక అవకాశంగా కూడా కొంత మంది నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే తెలంగాణ లో పార్టీ ఓటమి పాలు అయిన వెంటనే కెసిఆర్ అసలు మహారాష్ట్ర అంశాన్ని వదిలేశారు. దీంతో గతంలో బిఆర్ఎస్ లో చేరిన వివిధ పార్టీల నాయకులు కూడా ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరుణంలో మరి కెసిఆర్ రంగంలోకి దిగుతారా లేదా అన్నది వేచిచూడాల్సిందే. తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో దుమ్మురేపుతున్నప్పుడు బిఆర్ఎస్ ఎందుకు జాతీయ స్థాయిలో సత్తాచాటకూడదు అంటూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారంలో ఉన్న సమయంలో పలుమార్లు మీడియా ముందు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తెలుగు సినిమాలు తన సత్తా చాటుతూనే ఉన్నాయి. మరి ఇప్పుడు బిఆర్ఎస్ ను తెలంగాణ కు పక్కనే ఉన్న మహారాష్ట్ర బరిలో నిలుపుతారా లేదా అన్నదే ఇప్పుడు కీలకం కానుంది. ఇంతకాలం మౌనంగా ఉండి...ఇప్పుడు బిఆర్ఎస్ నిజంగా మహారాష్ట్రలో పోటీ కి సిద్ధం అయినా కూడా బీజేపీ కి మేలు చేయటం కోసమే ఆ పార్టీ మళ్ళీ తెరమీదకు వచ్చింది అనే విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News