కేటీఆర్, హరీష్ రావు దూకుడు అసలుకే కొంప ముంచుతుందా?!

Update: 2024-11-16 12:32 GMT

ఎన్నికైన ప్రభుత్వాన్ని లెక్కచేయని వీళ్లు మళ్ళీ గెలిస్తే ప్రజలను లెక్క చేస్తారా?

తెలంగాణ లో డేంజరస్ రాజకీయాలు సాగుతున్నాయా?. అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రధానంగా ప్రతిపక్ష బిఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు దుమారం రేపుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నేతల తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష పార్టీ గా ప్రభుత్వాన్ని హామీలు అమలు చేయాలని డిమాండ్ చేయటంతో పాటు ప్రభుత్వం చేసే తప్పులు ఎండగడితే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ గత కొన్ని నెలలుగా బిఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు లు వ్యవరిస్తున్న తీరు మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు కాంగ్రెస్ పార్టీ తమ అధికారాన్ని బలవంతంగా గుంజుకుంది అన్న తీరులో వీళ్ళిద్దరూ వ్యవహరిస్తున్నారు అన్న చర్చ బిఆర్ఎస్ నాయకుల్లో కూడా సాగుతోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం లగచర్ల లో బిఆర్ఎస్ నాయకులు వ్యవహరించిన విధానం...ఈ విషయంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తున్న తీరు రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లగచర్ల వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే బిఆర్ఎస్ ఈ విషయంలో స్పందిస్తున్న తీరు రాజకీయంగా ఆ పార్టీ ని రాబోయే రోజుల్లో కోలుకోలేని దెబ్బ తీస్తుంది అన్న చర్చ సాగుతోంది.

                                                            అది ఎలాగంటే అధికారంలో ఉన్న సమయంలో బిఆర్ఎస్ పై ఉన్న ప్రధాన విమర్శ కెసిఆర్, కేటీఆర్ లు అహంకారంతో సొంత పార్టీ మంత్రులు..ఎమ్మెల్యేలు..పార్టీ నాయకులకు కూడా పట్టించుకోలేదు అని. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా కేటీఆర్, హరీష్ రావు లు ఎన్నికైన ప్రభుత్వాన్ని తాము అసలు పని చేయనివ్వబోము అన్నట్లు వ్యవహరిస్తున్నారు. బిఆర్ఎస్ నాయకులు చెప్పినట్లు రేవంత్ రెడ్డి సర్కారు దారుణమైన తప్పులు చేసుకుంటూ పోతే నాలుగేళ్ళ తర్వాత బిఆర్ఎస్ పార్టీ నే కళ్ళు మూసుకుని మళ్ళీ అధికారంలోకి వస్తుంది. కానీ బిఆర్ఎస్ నేతలు అయినా కేటీఆర్, హరీష్ రావు లు ప్రతిపక్షంలో ఉండి ఎన్నికైన ప్రభుత్వం విషయంలోనే నిండా ఏడాది కూడా కాకముందే ఇలా వ్యవహరిస్తున్నారు కదా ...పొరపాటున మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అన్న చర్చ, భయం రాజకీయ నాయకులతో పాటు సామాన్య ప్రజల్లో కూడా సాగుతోంది. ఎందుకంటే పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎలా వ్యవహరించారో చూశారు...ఇప్పడు ప్రతిపక్షంలో కూడా ఏ మాత్రం మారకుండా ఉన్నారు అనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రజలకు ఆ విషయం చెప్పటంలో తప్పులేదు.

                                                  ఇంకా వీలు అయితే న్యాయపరంగా కూడా అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే ఆర్థికంగా ఎంతో బలంగా ఉన్న బిఆర్ఎస్ కు ఇది పెద్ద సమస్య కూడా కాదు. కానీ ఆ పార్టీ ..ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావులు వ్యవహరిస్తున్న తీరు అసలు మమ్మల్ని అధికారం నుంచి దించిన కాంగ్రెస్ ఎలా పని చేస్తదో మేము చూస్తాం అంటూ నిత్యం చేస్తున్న రాజకీయ రచ్చ భవిష్యత్ లో బిఆర్ఎస్ ను మరింత డ్యామేజ్ చేయటం ఖాయం అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. హరీష్ రావు తో పోలిస్తే కేటీఆర్ దూకుడు పార్టీ కి సమస్యలు తెచ్చిపెట్టడం ఖాయం అని...పవర్ పోయినా కూడా వీళ్ళలో ఏ మాత్రం మార్పు రాలేదు అన్న ఫీలింగ్ ఎక్కువ మందిలో కనిపిస్తోంది. అంత మాత్రాన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేయటం లేదు అని ఎవరూ సర్టిఫికెట్ ఇవ్వరు. అయితే ఇప్పుడు చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న కెసిఆర్, కేటీఆర్ లు అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో తెలంగాణ ప్రజల కళ్ళ ముందే ఉంది.

                                                          అధికారంలో ఉంటే అంతా మా ఇష్టం. ప్రతిపక్షంలో ఉంటే మమ్మల్ని కాదని మీరు పని ఎలా చేస్తారో చూస్తాం అన్నట్లు ఉంది ఆ పార్టీ తీరు ఇప్పుడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వరసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ఎలా వ్యవహరించిందో అందరూ చూశారు. వాస్తవానికి అప్పటిలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా చేసింది ఏమి లేదు అని చెప్పొచ్చు. బిఆర్ఎస్ జమానాలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక ధర్నా...లేదా ఇతర కార్యక్రమానికి పిలుపునిస్తే చాలు నేతలు అందరిని హౌస్ అరెస్ట్ లు చేసిన విషయం తెలిసిందే. కొంత కాలం ధర్నా చౌక్ లో ధర్నాలు చేయనీయలేదు...ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు బహిరంగ సభలకు కూడా అనుమతి ఇవ్వలేదు. అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతరేకంగా ధర్నా అయినా...బహిరంగ సభ అయినా కోర్ట్ నుంచి అనుమతి తెచ్చుకుంటే తప్ప..ముందుకు సాగనివ్వలేదు. కానీ ఇప్పుడు బిఆర్ఎస్ చేస్తున్న హంగామా అందరూ చూస్తున్నారు.

Tags:    

Similar News