లోక్ సభ ఎన్నికల వేళ కొత్త రాగం

Update: 2024-05-06 11:22 GMT

Full Viewఎన్నికలు వచ్చినప్పుడో..లేక తన రాజకీయ అవసరం ఉంటే తప్ప బిఆర్ఎస్ అధినేత, తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్దగా బయట కనిపించరు. అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలు కెసిఆర్ తీరు చూశారు. అధికారంలో ఉన్నంత కాలం తన కల అయిన ప్రత్యేక రాష్ట్రం సాధించాను..రెండు టర్మ్ లు సీఎం అయ్యాను. ఇంతకంటే తనకు ఏమి కావాలన్నారు. అంతే కాదు...తన పాలనలో తెలంగాణా బంగారు తెలంగాణ గా మారింది అని..ఇక దేశం పై ఫోకస్ పెట్టడానికే టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చుతున్నట్లు ప్రకటించారు. దేశాన్ని ఇప్పటివరకు సుదీర్ఘంగా పాలించిన కాంగ్రెస్ పార్టీకి...బీజేపీ కి అసలు పాలనే చేతకాదు అని కెసిఆర్ చెప్పిన విషయం తెలిసిందే. అందుకే తాను రంగంలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో తాను చేయాల్సిన పనులు దాదాపు అన్ని పూర్తి అయ్యాయి అని...తన పాలనతో తెలంగాణ దేశానికే మోడల్ గా మారింది అన్నట్లు చెప్పుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కెసిఆర్ దేశీయ రాజకీయాలు ఊసు మర్చిపోయారు. మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో పోటీ చేస్తామనే ప్రతిపాదనను అటకెక్కించారు.

                                  ఇప్పుడు కెసిఆర్ మళ్ళీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కొత్తగా తెలంగాణ ఉద్యమం అయిపోలేదు...రాష్ట్ర పునర్ నిర్మాణ ప్రక్రియ ఇంకా ఉంది అని ప్రకటించారు. ఆదివారం నాడు కరీంగర్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కెసిఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నంత కాలం తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయింది...ఇక దేశాన్ని బాగు చేస్తా అని పదే పదే ప్రకటించిన కెసిఆర్ ఇప్పుడు అధికారం పోయేటప్పటికీ ఇంకా తెలంగాణా ఉద్యమం పూర్తి కాలేదు..పునర్ నిర్మాణ ప్రక్రియ పూర్తి కాలేదు అంటూ కొత్త రాగం అందుకున్నారు. అధికారం పోయిన తర్వాతే కెసిఆర్ కు ఇంకా పునర్నిర్మాణం, ఉద్యమం వంటి విషయాలు మళ్ళీ గుర్తుకు వస్తున్నట్లు కనిపిస్తోంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కెసిఆర్ మాటలు చూస్తుంటే అయన పదవి పోయిన ఐదు నెలల్లోనే కెసిఆర్ నిర్మించిన బంగారు తెలంగాణ ఆగమాగం అయినట్లు చెపుతున్నారు. మరి ఇలాంటి వ్యాఖ్యలు లోక్ సభ ఎన్నికల్లో కెసిఆర్ కు ఏమైనా ఫలితాన్ని ఇస్తాయా లేదా అన్నది జూన్ నాలుగున కానీ తేలదు.

Tags:    

Similar News