బిజెపి అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పలు అంశాలపై పార్టీ వైఖరికి భిన్నంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారని..ఇది పార్టీ రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది. అందుకే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కేంద్ర క్రమశిక్షణా సంఘం సభ్య కార్యదర్శి ఓం పాఠక్ తన సస్పెన్షన్ ఆదేశాల్లో పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యే వరకూ ఆయన్ను అన్ని బాధ్యతల నుంచి తప్పిస్తున్నామని..తాము జారీ చేసే షోకాజ్ నోటీసుకు సెప్టెంబర్ 2లోగా సమాధానం ఇవ్వాలన్నారు. సరైన సమాధానం ఇవ్వకపోతే పార్టీ నుంచి బహిష్కరిస్తామని పేర్కొన్నారు.
రాజాసింగ్ యూట్యూబ్ లో పెట్టిన వీడియో దుమారం రేపటంతో తెలంగాణ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. యూట్యూబ్ కూడా ఈ వివాదస్పద వీడియోను తొలగించింది. దీనిపై ఎంఐఎం అధినేత ఓవైసీ కూడా ఘాటుగా స్పందించారు. ఇస్లామ్‌కు, మహ్మాద్ ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడటం బీజేపీకి పాలసీగా మారిపోయిందని మండిపడ్డారు. రాజాసింగ్ విచారణను పోలీసులు రికార్డు చేయాలని డిమాండ్ చేశారు. రాజాసింగ్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే నూపుర్ శర్మ వివాదంలో బిజెపికి తలబొప్పి కట్టడంతో రాజాసింగ్ విషయంలో కూడా ఆగమేఘాలపై స్పందించి ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.