రెండు పార్టీల డీల్ కు క్లియర్ సంకేతం అంటున్న రాజకీయ వర్గాలు
ఎలాంటి కెసిఆర్ ఎలా అయి పోయారు. తెలంగాణకు వచ్చి ప్రధాని మోడీ ఆయనపై తీవ్ర విమర్శలు చేసి వెళ్లినా కూడా ఒక్కటంటే ఒక్క మాట మోడీపై కెసిఆర్ మాట్లాడలేదు దీంతో ప్రజల్లో ఉన్న అనుమానాలు మరింత బలపడ్డాయి అని చెప్పొచ్చు. శనివారం వరంగల్ లో పర్యటించిన ప్రధాని మోడీ తెలంగాణ సీఎం కెసిఆర్, బిఆర్ఎస్ పై ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మోడీ తెలంగాణ టూర్ ముగిసిన తర్వాతే సీఎం కెసిఆర్ తెలంగాణ భవన్ లో మహారాష్ట్ర కు చెందిన నేతల చేరికల కార్యక్రమం పెట్టుకున్నారు. పాత కెసిఆర్, రాజీ పడని కెసిఆర్ అయితే దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కెసిఆర్ ది, ఢిల్లీ దాకా ఈ అవినీతి పాకింది అంటూ తీవ్ర విమర్శలు చేసిన మోడీ ని ఒక్క మాట కూడా అనకుండా వదిలేస్తారా అన్న చర్చ సాగుతోంది. ఈ విషయాన్నీ గమనిస్తే రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నట్లు రెండు పార్టీ ల మధ్య డీల్ సెట్ అయింది అనే విషయం తేలి పోయింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. శనివారం నాడు కెసిఆర్ అసలు బయటకు రాకపోతే ఈ చర్చ ఉండేది కాదు.
కానీ తెలంగాణ భవన్ లో చేరికల కార్యక్రమంలో మాట్లాడి కూడా అసలు తెలంగాణాలో మోడీ పర్యటించారు అనే విషయం తనకు తెలియదు అనే రీతిలో బిఆర్ఎస్ అధినేత, సీఎం కెసిఆర్ వ్యవహరించటం తో బిఆర్ఎస్ , బీజేపీ ల బంధంపై ప్రజల్లో అనుమానాలు మరింత బలపడ్డాయి. మహారాష్ట్ర కు చెందిన నేతల చేరికల సందర్భంగా ఎప్పటిలాగానే కెసిఆర్ తమది అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదం అని...భారత దేశ పరివర్తనే బిఆర్ఎస్ లక్ష్యం అని ప్రకటించుకున్నారు. ప్రధాని మోడీ టూర్..విమర్శలపై మంత్రులు కెటిఆర్ దగ్గరనుంచి అందరూ స్పందించినా సీఎం కెసిఆర్ మౌనం దాల్చటం...అది కూడా ఎన్నికల ముందు రాష్ట్రంలో జరిగే ప్రతి ప్రాజెక్ట్ లో అవినీతి జరుగుతోంది అని మోడీ ఆరోపించినా పట్టించుకోకపోవటం అన్నది ఇప్పుడు కీలకంగా మారింది అనే చెప్పాలి. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే లిక్కర్ స్కాం విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో కూడా సీఎం కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కేంద్రంలోని మోడీ సర్కారు, మోడీ పై విమర్శలు గుప్పించేవారు. ఆమె కూడా ఇప్పుడు ప్రధాని మోడీ వరంగల్ టూర్ పై ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు. దీంతో లోపాయికారీ ఒప్పందం నిజం అన్న చర్చ బలపడుతోంది.