అందుకే యాక్షన్ ఉండటం లేదా?
ఇలా అయితే రేవంత్ రెడ్డి మాటలు ఎవరైనా నమ్ముతారా?
బిఆర్ఎస్ స్కాం లనే కాంగ్రెస్ పార్టీ కూడా ఉపయోగించుకుంటుందా?. అందుకే ఎన్నికలకు ముందు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు యాక్షన్ కు వెనకాడుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది ఆ పార్టీ నేతల నుంచి. బిఆర్ఎస్ పదేళ్ల హయాంలో ఏమి జరిగిందో ప్రతిపక్షంలో ఉండగా లెక్కలతో సహా పలు మార్లు అధికారిక ప్రకటనలు చేశారు. బహిరంగ సభల్లో కూడా చెప్పుకొచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా కూడా ఒక్కటంటే ఒక్క విషయంలో బిఆర్ఎస్ ను దోషిగా చూపించటంలో రేవంత్ రెడ్డి సర్కారు ఘోరంగా విఫలం అయింది. దీంతో రేవంత్ రెడ్డి తో పాటు ఆయన క్యాబినెట్ లోని మంత్రులు బిఆర్ఎస్ పై చేసిన విమర్శలు అన్నీ అబద్దం అయినా అయి ఉండాలి...లేకపోతే ఎలాంటి చర్యలు తీసుకోకుండా బిఆర్ఎస్ తో అధికార పార్టీ రాజీ అయినా పడి ఉండాలి. ఈ రెండింటిలో ఏమి జరిగిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఆయన మంత్రి వర్గ సహచరులే ఇప్పుడు బయటపెట్టాలి.
ముఖ్యంగా సాగునీటి రంగంలో కమిషన్ల కోసమే ఇష్టానుసారం పనులు చేశారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెపుతూ వస్తున్నారు. అంత పక్కా గా కమిషన్లు తీసుకున్న ఆధారాలు ఉంటే బిఆర్ఎస్ కీలక నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వదిలేస్తున్నట్లు?. ఇదే ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా అంతు చిక్కని ప్రశ్నగా ఉంది. అంతే కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ నేతల అవినీతి విషయంలో పదే పదే చేస్తున్న కామెంట్స్ ప్రజలతో పాటు కాంగ్రెస్ నేతల్లో కూడా ఎన్నో అనుమానాలు రేపుతున్నాయి. ఒక్కో సారి దేవుడే అన్నీ చూసుకుంటాడు అంటారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ కక్కిస్తాం...చర్లపల్లి జైలు లో పెడతాం బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు.
లక్ష కోట్ల రూపాయలుపైగా ఖర్చుపెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిలో అత్యంత కీలకమైన మోటార్లు..పంపుల కాంపోనెంట్ ను విచారణ పరిథి నుంచి తప్పించటంతోనే రేవంత్ రెడ్డి సర్కారు జరిపించిన విచారణ డొల్లతనం బయటపడింది అనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇది అంతా కూడా ఒక పక్కా ప్లాన్ ప్రకారమే చేశారు అని అధికారులు కూడా చెపుతున్నారు. మరో వైపు దారుణ పరిస్థితి ఏంటి అంటే బిఆర్ఎస్ పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి తో పాటు ఇతర మంత్రులు ఇప్పుడు అంతా సైలెంట్ అయిపోతే..బిఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ సర్కారు గుక్కతిప్పుకోకుండా అవినీతి ఆరోపణలు చేస్తోంది. హిల్ట్ పాలసీ దగ్గర నుంచి మూసీ ప్రాజెక్ట్ ..ఇలా ప్రతి విషయంలో కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. బిఆర్ఎస్ చేసే అవినీతి లెక్కల ఆరోపణలు చూసి ఇవి కసితో చేస్తున్నవే అన్న ఫీలింగ్ ఎక్కువ మందికి కలుగుతోంది. ఎందుకంటే అంత భారీ మొత్తంలో అంటే మెదడులో ఏ ఫిగర్ వస్తే ఆ ఫిగర్ చెపుతున్నట్లు ఉంది ఆ పార్టీ నేతల అవినీతి ఆరోపణల లెక్కలు.
ఇలా అడ్డగోలు గా అవినీతి ఆరోపణలు చేస్తున్నా కూడా బిఆర్ఎస్ పదేళ్ల అక్రమాల విషయంలో ఒక్కటంటే ఒక్క యాక్షన్ లేకపోవటం కాంగ్రెస్ ప్రభుత్వ పరువు తీస్తోంది అనే చర్చ కాంగ్రెస్ నేతల్లోనే ఉంది. ఇంకో రెండేళ్లు పోతే రాష్ట్రంలో ఎన్నికల వాతారవరణమే వస్తది. ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికల ముందు ఎలాంటి అరెస్ట్ లు చెయ్యదు. ఎందుకంటే రాజకీయంగా అది భారీ చేస్తుంది కాబట్టి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి నిజంగా అక్రమార్కులపై...అవినీతికి పాల్పడిన వాళ్లపై చర్యలు తీసుకోవాలనే ఉద్దేశమే ఉంటే ఫస్ట్ రెండేళ్లలోనే పక్కాగా ప్లాన్ చేసి ఆ పని చేసేవాళ్ళు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కానీ బిఆర్ఎస్ స్కాం లనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాడుకుంటోంది అని...అందుకే వాటి విషయంలో కేవలం మాటలు తప్ప...యాక్షన్ ఉండటం లేదు అని కాంగ్రెస్ నేతలే చెపుతున్నారు. ఇలా అయితే వచ్చే ఎన్నికల నాటికీ రేవంత్ రెడ్డి మాటలు ఎవరైనా నమ్ముతారా?. పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది అని చెపుతున్న రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ హయాంలోని అక్రమాలు అన్నిటిని దేవుడికే వదిలేశాం అని చెప్పి ఓట్లు అడుగుతారా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.