హుజూరాబాద్ ఉప ఎన్నికను మలుపుతిప్పే పథకం అనుకున్నారు. ఈ నియోజవర్గంలో ఉన్న నలభై వేలకు పైగా దళిత కుటుంబాలు ఒక్కసారిగా అధికార టీఆర్ఎస్ వైపు మారిపోతాయని భావించారు. అందుకే ఎక్కడాలేని విధంగా ఈ నియోజకవర్గానికే తెలంగాణ సర్కారు ఏకంగా రెండు వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించటమే కాదు..విడుదల చేసింది కూడా. అయితే ఆ తర్వాత పలు సమస్యలు వచ్చాయి. లబ్దిదారుల ఖాతాల్లో నిధులు అయితే జమ అయ్యా యి కానీ కొన్ని చోట్ల వాడుకోవటంపై పలు ఆంక్షలు వచ్చాయని ప్రచారం జరిగింది. ఇది అంతా ఒకెత్తు అయితే దళితబంధు పథకాన్ని ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి గ్రామంలో ప్రారంభించారు.
అయితే అనూహ్యంగా శాలపల్లి గ్రామంలో కూడా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం సాధించడం చర్చనీయాంశమైంది. దీంతో టీఆర్ఎస్ ప్రయోగించిన దళితబంధు అస్త్రం ఈ ఎన్నికల్లో ఫలించలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ అంశంపై బిజెపి జాతీయ ఉపాధ్యక్షరాలు డీ కె అరుణ స్పందించారు. దళిత బంధు ప్రారంభించిన చోట కూడా బిజెపికే ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. నియంత పాలనకు చరమగీతం పాడాలని హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు నిర్ణయించారన్నారు. ఈ ఎన్నికలు కెసీఆర్, ఈటెల మధ్యే జరిగాయన్నారు.