అధికార టీఆర్ఎస్ బిజెపికి బిగ్ షాక్ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని కలలు కంటున్న ఆ పార్టీ ఇటీవల కాలంలో యమా స్పీడ్ పెంచింది. ఈ తరుణంలో టీఆర్ఎస్ పార్టీ బిజెపికి ఓ ఝలక్ ఇచ్చింది. దేశ స్థాయి బిజెపి నేతలు అందరూ హైదరాబాద్ లో అడుగుపెట్టేందుకు సిద్ధం అవుతున్న వేళ ఆ పార్టీకి చెందిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు బిజెపికి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరారు. నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో పాటు తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ టీఆర్ఎస్లో గూటికి వచ్చారు. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ , రాజేంద్రనగర్ కార్పొరేటర్ అర్చన ప్రకాష్ , జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేష్ అడిక్ మెట్ కార్పొరేటర్ సునిత ప్రకాష్ గౌడ్ , తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజ గౌడ్ , కౌన్సిలర్ ఆసిఫ్ లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి , ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్ , ఎమ్మెల్యే దానం నాగేందర్ , పైలెట్ రోహిత్ రెడ్డి, సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పి కార్పొరేటర్లను మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ప్రధాని మోదీ మరో 24 గంటల్లో జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ వస్తున్నారు. సొంత పార్టీ కార్పొరేటర్లు టీఆర్ఎస్ లో చేరడం బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. టీఆర్ఎస్ ఈ చేరికలను కూడా వ్యూహాత్మకంగానే పెట్టుకున్నట్లు భావిస్తున్నారు. బిజెపిపై మంత్రి కెటీఆర్ నిత్యం సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఏ చిన్న ఛాన్స్ దొరికినా ఆయన ఏ మాత్రం ఆలోచించకుండా బిజెపిపై ఎటాక్ విషయంలో దూకుడు చూపిస్తున్నారు.