బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు చిక్కులు తప్పేలా లేవు. మాట్లాడితే కేటీఆర్ ఇదో లొట్ట పీస్ కేసు...ఇందులో ఏమీ లేదు అంటూ పదే పదే వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే. లొట్టపీసు కేసా...స్ట్రాంగ్ కేసా అన్నది తేల్చాల్సింది కోర్టు మాత్రమే. కానీ కేటీఆర్ మాత్రం అన్ని జడ్జిమెంట్స్ ఆయనే ఇచ్చుకుంటున్నారు. అసలు ఈ కేసు లో ఏమీ లేదు..అవినీతి అసలు జరగలేదు అని సర్టిఫికెట్స్ ఇచ్చుకుంటున్నారు. ఇది తేలేది విచారణ తర్వాత...నిర్దారించేది కోర్టు మాత్రమే. కానీ కేటీఆర్ తీరు మాత్రం అసలు తనపై కేసు పెట్టడం...విచారణ చేయటమే సరికాదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. నిజంగా కేటీఆర్ చెపుతున్నట్లు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏమి జరగకపోతే...న్యాయస్థానాలు కేసు ను కొట్టేస్తే కాంగ్రెస్ ప్రభుత్వ పరువే పోతుంది అనటంలో సందేహం లేదు. అయితే అసలు విచారణ జరగక ముందే కేసు పెట్టినప్పటి నుంచి కేటీఆర్ ఆగమాగం అవుతున్న తీరు మాత్రం అధికార వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది.
ఎక్కడ వరకో ఎందుకు పక్కనే ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ సర్కారు స్కిల్ డెవలప్ మెంట్ కేసు లో అరెస్ట్ చేసి..జైలు లో పెట్టిన సంగతి తెలిసిందే. కేటీఆర్ మంత్రిగానే పని చేశారు...కానీ చంద్రబాబు సుదీర్ఘకాలం సీఎం గా కూడా పని చేశారు. కానీ కేసు నమోదుకు...విచారణకు...అరెస్ట్ కు అవేమి అడ్డంకి కాలేదు. కానీ కేటీఆర్ మాత్రం అసలు తమపై కేసు ఎలా పెడతారు ...విచారణ చేస్తారా అన్నట్లు ఉంటున్నాయి ఆయన మాటలు. ఏసీబీ అలా కేసు నమోదు చేసిందో లేదో ఆగమేఘాల మీద హై కోర్టు క్వాష్ పిటిషన్ వేశారు. హై కోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేయటంతో ఏ మాత్రం జాప్యం చేయకుండా వెంటనే సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. కోర్టు లను ఆశ్రయించే హక్కు కేటీఆర్ కు ఉన్న విషయాన్ని ఎవరూ కాదన్నారు. కానీ ఈ విషయంలో కేటీఆర్ స్పీడ్ చూస్తేనే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అనే చర్చ సాగుతోంది.
కేటీఆర్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీం
హై కోర్టు తరహాలోనే సుప్రీం కోర్టు లో కూడా మాజీ మంత్రి కేటీఆర్ కు చుక్కెదురు అయింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేము అని సుప్రీం స్పష్టం చేసింది. అయితే పిటిషన్ ను వెనక్కి తీసుకోవటానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసులో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌ను వేసిన సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం నాడు సుప్రీం ధర్మాసనం ముందు విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణలో భాగంగా కేటీఆర్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ ఫార్ములా కారు రేసు కేసులో హెచ్‌ఎండీఏను, ఇతరులను భాగస్వాములు చేయకుండా..కేవలం ఇద్దరు అధికారులను, కేటీఆర్‌ను మాత్రమే నిందితులుగా చేర్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
రాజకీయ కోణంలోనే వేధింపులకు గురి చేసేలా కేసు లు పెట్టారు అని తెలిపారు. అయితే విచారణ ప్రాధమిక దశలో ఉన్న తరుణంలో తాము ఇందులో జోక్యం చేసుకోము అని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం పేర్కొంది. దీంతో ఇప్పుడు ఏసీబీ మరో సారి ఈ కేసు విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసు లు జారీ చేసే అవకాశం ఉంది అని సమాచారం. అదే సమయంలో విచారణలో భాగంగా వచ్చిన సమాచారం ఆధారంగా మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది అని సమాచారం . గతంలో ఈ కేసుకు సంబంధించి కేటీఆర్‌ను దగ్గర దగ్గర ఆరు గంటలపైనే ఏసీబీ విచారించిన విషయం తెలిసిందే. మరో వైపు కేటీఆర్ ఇదే కేసు లో ఇప్పుడు ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది.