నలుగురు కలెక్టర్లు..పోలీస్ ఉన్నతాధికారులు బదిలీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం (సిఈసి) సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అధికార టిఆర్ఎస్ తో సన్నిహితంగా ఉంటున్నారు అనే ఆరోపణలతో పాటు పలు ఫిర్యాదులు రావటంతో షెడ్యూల్ ప్రకటించిన మూడవ రోజు కీలక జిల్లాలకు చెందిన నలుగురు కలెక్టర్లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది అధికార వర్గాల్లో పెద్ద కుదుపుగా మారింది అనే చెప్పాలి. బదిలీ అయిన కలెక్టర్లలో రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నిర్మల్ కలెక్టర్లు ఉన్నారు. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు గత కొన్ని సంవత్సరాలుగా అక్కడక్కడే ఉంటూ అధికార పార్టీ కి అనుకూలంగా పని చేస్తున్నారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. వీటితో పాటు భూముల విషయంలో కూడా వీళ్ళు ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు రాజకీయ పార్టీల నేతలు కూడా బహిరంగంగా విమర్శలు చేశారు.
ఈ తరుణంలో కీలక జిల్లాలకు చెందిన నలుగురు కలెక్టర్లను ఇంత సడన్ గా బదిలీ చేయటం కలకలం రేపుతోంది. తాజా పరిణామాలతో ఈ ఎన్నికల్లో అధికారులు ఇక ఏ మాత్రం గీత దాటే సాహసం చేయకపోవచ్చు అనే అంచనాలు వెలువడుతున్నాయి. నలుగురు కలెక్టర్లతో పాటు హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లను కూడా బదిలీ చేయాలని సిఈసి ఆదేశించింది. వీళ్ళతో పాటు బదిలీ అయిన వారిలో రవాణా శాఖ కార్యదరితో పాటు ఎక్సయిజ్ శాఖ శాఖ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. తెలంగాణ తో పాటు ఎన్నికల జరగనున్న ఇతర రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున అధికార్ల బదిలీకి ఆదేశించారు.