ప్రత్యర్ధులకు ఓ అస్త్రం అందించినట్లే?!
కేంద్రం నుంచి జాతీయ పార్టీలకు చెందిన ఢిల్లీ నేతలు తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వస్తేనే సీఎం కెసీఆర్..మంత్రి కెటీఆర్ లు గుజరాత్ గులాంలు..ఢిల్లీకి బానిసలు అంటూ విమర్శలు చేస్తారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతోపాటు పలు ఎన్నికల్లో ఇదే మాటలు అన్నారు. మాకు ఎవరూ బాస్ లు లేరు..మా బాస్ లు తెలంగాణ ప్రజలే..మాది తెలంగాణ ఆత్మ ఉన్న పార్టీ అని చెప్పుకునే టీఆర్ఎస్ ఇప్పుడు దేశంలో ఎన్నికల మాంత్రికుడుగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం చేసుకోనుందా?. గత కొన్ని రోజులుగా ఈ అంశంపై భారీగానే ప్రచారం సాగుతోంది. అయితే గురువారం నాడు ప్రముఖ ఆంగ్ల పత్రిక టైమ్స్ ఇండియా 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఎన్నికల వ్యూహకంపెనీ ఐప్యాక్ తో ఒప్పందం చేసుకునే అవకాశం ఉందని..ఇదే అంశంపై టీఆర్ఎస్ అధినేత కెసీఆర్, మంత్రి కెటీఆర్ లు కూడా ప్రశాంత్ కిషోర్ తో సమావేశం అయ్యారని టీఆర్ఎస్ వర్గాలను ఉటంకిస్తూ ఆ పత్రిక కథనం ప్రచురించింది. దేశానికే మార్గదర్శనం చేస్తున్నామని... దేశం అంతా తెలంగాణ పథకాలే కాపీ కొడుతున్నారని చెప్పుకుంటున్న కెసీఆర్, కెటీఆర్ లు ఇప్పుడు ఎన్నికల వ్యూహం కోసం ప్రశాంత్ కిషోర్ ను నియమించుకుంటే గెలుపు సంగతి ఎలా ఉన్నా టీఆర్ఎస్ శ్రేణులకు..ప్రజలకు మాత్రం ఖచ్చితంగా ఓ మెసెజ్ మాత్రం వెళుతుంది. అది ఏంటి అంటే కెసీఆర్, కెటీఆర్ లు మ్యాజిక్ ఇక తెలంగాణలో పనిచేయదు అని నిర్ణయించుకున్నాకే ప్రశాంత్ కిషోర్ కంపెనీ సేవల వైపు మొగ్గుచూపారనే అబిప్రాయం రావటం సహజం.
డబ్బులు తీసుకుని ఎన్నికలు సేవలు అందించే ప్రశాంత్ కిషోర్ తో టీఆర్ఎస్ పార్టీనే కాదు..ఎవరైనా ఒప్పందం చేసుకోవచ్చు. కానీ ఓ వైపు తెలంగాణలో తమకు టీఆర్ఎస్ అసలు ఎవరూ దగ్గరలో లేరని.... ఈ సారి ఎన్నికల్లో 100 నుంచి 105 సీట్లు గెలుస్తామని చెప్పిన కెసీఆర్ ప్రశాంత్ కిషోర్ టీమ్ తో ఒప్పందం చేసుకుంటే మాత్రం ఇది ఎన్నికల ముందే టీఆర్ఎస్ తొలి ఓటమి అవుతుందని ఓ నేత వ్యాఖ్యానించారు. అసలు తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి తనకు తెలిసినట్లు మరెవరికి తెలియదని చెప్పుకునే కెసీఆర్ వచ్చే ఎన్నికల్లో గెలవటానికి ప్రశాంత్ కిషోర్ సేవలు తీసుకుంటే అది పార్టీకి మైనస్ గా మారటం ఖాయం అనే అభిప్రాయం పార్టీ నేతల్లో కూడా ఉంది. అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ ను నియమించుకుంటే ప్రత్యర్ధి పార్టీలకు ఓ మంచి అస్త్రాన్ని అందించినట్లు కూడా అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. . తనపై తానే నమ్మకం కోల్పోయి ..ఇక ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పై ఆధారపడ్డారనే విమర్శలు ఎదుర్కోకతప్పదు. రెండుసార్లు అధికారంలో ఉండి తెలంగాణను ఎంతో ప్రగతిపథంలో నడిపించానని..గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి చేశామని చెప్పుకునే కెసీఆర్, కెటీఆర్ లు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ను నమ్ముకోవటం అంటే...ఇది ఒకింత ఆశ్చర్యకరమే. అయితే దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచిచూడాల్సిందే.