హైదరాబాద్ లో భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ఇళ్ళకు ప్రభుత్వ సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పరిహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై స్పందించారు. ఆయన తన నియోజకవర్గం పరిధిలో పర్యటించారు. 'వరద పరిహారం పంపిణీపై ఎల్బీ నగర్ లో జోనల్ కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడా. ఎల్బీ నగర్ లో రూ. 65 కోట్లు వరద సాయం అందించినట్టు రికార్డుల్లో ఉంది. మున్సిపల్ కాలనీలో చిన్న ఇంట్లో తొమ్మిది మందికి పరిహారం ఇచ్చినట్టు రికార్డుల్లో ఉంది . సాయం పంపిణీలో ఇలాంటి అసాధారణ అంశాలు చాలా ఉన్నాయి.
విజిలెన్స్, ఏసీబీతో విచారణ జరిపించాలి. నేను ప్రతి డివిజన్ నుంచి ఆధారాలతో సమాచారం పంపుతాను. విచారణ జరపాలి ' అని కోరారు. హైదరాబాద్ ను విశ్వనగరం చేస్తామన్న ప్రభుత్వ ప్రాధాన్యతలు మారిపోయాయని, సంపన్నులు ఉండే చోట, తమకు కావాల్సిన వారి ప్రాజెక్టులు ఉన్న చోట మాత్రమే మెరుగులు అద్దుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు, నాయకులు కబ్జాల వల్లే హైదరాబాద్ లో వరదలకు ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు.