తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కెసీఆర్ తీరుపై ఆయన మండిపడ్డారు. రాఫెల్ జెట్స్ కొనుగోలు విషయంలో సుప్రీంకోర్టు కేంద్రానికి క్లీన్ చిట్ ఇచ్చిందని..ఈ విషయంలో సుప్రీం తీర్పును ధిక్కరిస్తున్న కెసీఆర్ నోరు జారితే రాఫెల్ రెక్కలకు కడతాం అంటూ వ్యాఖ్యానించారు. జవాన్ల త్యాగాలను కించపరిచేలా మాట్లాడటం దేశద్రోహమేనని పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడటం సరికాదన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌పై సైన్యాన్ని, ప్రధాని మాటలను కేసీఆర్ నమ్మడం లేదని, మరి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజహర్ చెబితే నమ్ముతారా అని బండి ప్రశ్నించారు.
సైన్యాన్ని అనుమానిస్తోన్న కేసీఆర్ ఏ దేశానికి మద్దతు పలుకుతున్నారో చెప్పాలని బండి డిమాండ్ చేశారు. సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడిన కేసీఆర్ వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. కేసీఆర్ ఈ మధ్య టెన్ జన్‌పథ్ స్క్రిప్ట్ ఫాలో అవుతున్నారని రాబోయే రోజుల్లో ప్రగతి భవన్ నుంచి గాంధీభవన్‌కు మారబోతున్నారని బండి ఎద్దేవా చేశారు. మోదీ వచ్చాకే రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్ని 32 నుంచి 42 శాతం పెంచిన విషయాన్ని బండి గుర్తు చేశారు. కేంద్రం పేరు చెప్పి మీటర్లు పెట్టేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని బండి ఆరోపించారు. విద్యుత్ మీటర్ల సమస్య దేశవ్యాప్తంగా ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ రైతులను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.