తెలంగాణలో ప్రస్తుతం రాజకీయం అంతా ఐటిఐఆర్ చుట్టూ తిరుగుతోంది. ఎప్పుడో కాంగ్రెస్ హయాంలో మంజూరు అయిన ఈ ప్రాజెక్టుపై ఇప్పుడు రాజకీయ రగడ లేవటానికి కారణం ఎన్నికలే. తాజాగా తెలంగాణ ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ మరోసారి ఐటిఐఆర్ ప్రాజెక్టుపై కేంద్రానికి లేఖ రాశారు. హైదరాబాద్ ఐటి రంగంలో దేశ సగటు కంటే ఎంతో మెరుగైన ప్రగతి సాధిస్తోందని..ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఐటిఐఆర్ కాకపోయినా ప్రత్యేక అంశంగా పరిగణించిన తత్సమానమైన హోదా అయినా ఇవ్వాలని కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు లేఖ రాశారు. దీనిపై తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ స్పందించారు. ఈ అంశంపై సీఎం కెసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఐటిఐఆర్ ప్రాజెక్టు వెనక్కిపోయిందని విమర్శించారు. ఈ ప్రాజెక్టు అమలుకు సంబంధించి ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్రానికి నివేదికలు పంపాల్సి ఉన్నా..ఇవేమీ పట్టించుకోకుండా ఇఫ్పుడు విమర్శలు చేయటం దారుణం అన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో యువత నుంచి వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని తన లేఖలో ప్రస్తావించారు.
రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ వల్లే ప్రాజెక్టు అటకెక్కిందనే విషయాన్ని కాగ్ 2017 మార్చి నివేదికలో స్పష్టంగా పేర్కొందని..ఎవరికి అనుమానం ఇది చూసుకోవచ్చని సంజయ్ తన లేఖలో ప్రస్తావించారు. ఈ విషయం కాగ్ నివేదికలోనే వెల్లడైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రానికి రోజుకో లేఖ పేరుతో హంగామా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఐటిఐఆర్ అంశంపై అధికార టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తోంది. కేంద్రం అప్పట్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కేటాయిస్తే..టీఆర్ఎస్, బిజెపిలు దీన్ని అటకెక్కించాయని..దీని వల్ల హైదరాబాద్ లో రావాల్సిన లక్షలాది ఉద్యోగాలు రాకుండా పోయాయని విమర్శిస్తున్నారు. ఈ ప్రాజెక్టు అమలు అయితే మౌలికసదుపాయాల కల్పన కోసం కేంద్రం నుంచి భారీ ఎత్తున నిధులు వచ్చి ఉండేవి.