అల్లు అర్జున్ కు అటు..ఇటు ఇరకాటం తప్పదా!

Update: 2023-08-19 11:46 GMT

Full Viewఅల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి. ఆమె తండ్రి చంద్ర శేఖర్ రెడ్డి. అయన బిఆర్ఎస్ నాయకుడు...వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉండబోతున్నట్లు ప్రకటించారు. తన గెలుపు కోసం తన అల్లుడు, హీరో అల్లు అర్జున్ కూడా ప్రచారం చేస్తాడని వెల్లడించారు. శనివారం నాడు అల్లు అర్జున్ నల్గొండ జిల్లాలో పర్యటించి తన మామ కంచర్ల చంద్ర శేఖర్ రెడ్డి నిర్మించిన కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అభిమానులతోను మాట్లాడారు. తన ఉరికి మేలు చేయాలనే ఉద్దేశంతో చంద్ర శేఖర్ రెడ్డి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అని అల్లు అర్జున్ కొనియాడారు. నల్గొండలో తన మామ కోసం అల్లు అర్జున్ ఎంట్రీ తో కొత్త చర్చ స్టార్ట్ అయింది. ఈ ఐకాన్ స్టార్ రాజకీయ ప్రచారం ఈ ఒక్క మామకే పరిమితం చేస్తారా...మరో మామ పవన్ కళ్యాణ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే చర్చ స్టార్ట్ అయింది. ఎన్నడూ లేనిది కొద్ది రోజుల క్రితం నిర్వహించిన వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ టాలీవుడ్ కు చెందిన టాప్ హీరోల ఫాన్స్ అంతా రాజకీయం విషయంలో ఒకే మాటపై ఉండాలంటూ పలు మార్లు విజ్ఞప్తి చేశారు.

ఇది పార్టీల కోసం కాదు అని...ఆంధ్ర ప్రదేశ్ మేలు కోసం అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఎన్నికల్లో పిల్లనిచ్చిన మామ కోసం ప్రచారం చేసి...ఆంధ్ర ప్రదేశ్ లో చిరంజీవి సోదరుడు. మరో మామ పవన్ కళ్యాణ్ విషయంలో అల్లు అర్జున్ స్టాండ్ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారబోతుంది. నేరుగా రాజకీయాల్లో లేకుండా హీరో లు బహిరంగంగా ఏ ఒక్క పార్టీ కి మద్దదు ఇచ్చే పరిస్థితి కూడా లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే బహిరంగంగా ఒక ప్రకటన చేస్తే ఇతర పార్టీ ల నేతలు, క్యాడర్ ఆ హీరో లపై దుమ్మెత్తి పోయటమే కాకుండా వాళ్ళ సినిమా లు రిలీజ్ అయినా సమయంలో దెబ్బ కొట్టటానికి ఏ మాత్రం వెనకాడటం లేదు. గతంలో ఎన్టీఆర్ కూడా ఈ తరహా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొన్నటికి మొన్న చిరంజీవి నటించిన భోళా శంకర్ విషయంలో అధికార వైసీపీ కి చెందిన సోషల్ మీడియా విభాగం అయితే భోళా శంకర్ పై ఒక ఉద్యమం తరహాలో వ్యతిరేక ప్రచారం చేసింది. ఈ తరుణంలో మరి అల్లు అర్జున్ ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో నేరుగా వేలు పెడతారా..ఆ పరిస్థితి ఉందా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు.

Tags:    

Similar News