ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కీలక మలుపు. మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈడీ తమ ముందు జనవరి ఏడున హాజరు కావాలని కేటీఆర్ కు నోటీసులు జారీ చేసిన తరుణంలో..ఒక రోజు ముందు అంటే ఈడీ ఇచ్చిన డేట్ కంటే ఒక రోజు ముందు జనవరి ఆరు న తమ ముందు హాజరు కావాలని ఏసీబీ తన నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఏసీబీ నమోదు చేసిన కేసు విషయంలో కేటీఆర్ హై కోర్ట్ లో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా...ఇరు పక్షాల వాదనలు విన్న హై కోర్ట్ తీర్పును రిజర్వు చేసింది. తీర్పు వెలువరించే వరకు కేటీఆర్ అరెస్ట్ చేయవద్దు అని కూడా హై కోర్ట్ ఆదేశించింది. అదే సమయంలో ఏసీబీ తన విచారణ తో ముందుకు సాగవచ్చు అని పేర్కొంది.
దీంతో ఇప్పుడు ఏసీబీ విచారణలో భాగంగా కేటీఆర్ కు తొలి సారి నోటీసు లు జారీ చేసి...జనవరి ఆరు న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఇప్పటికే ఏసీబీ ఫిర్యాదుదారు అయిన ఐఏఎస్ అధికారి దాన కిశోర్ నుంచి దగ్గర దగ్గర ఏడు గంటల పాటు మొత్తం కేసు పూర్వాపరాలు తీసుకుంది. ఆ సమయంలోనే ఈ మొత్తం వ్యవహారం లో అడ్డగోలు ఉల్లంఘనలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం ఈ కేసు ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ..ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం అసలు ఇది కేసు కాదు అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఏసీబీ, ఈడీ విచారణల తర్వాత ఏమి జరుగుతుందో చూడాలి.