ఎట్టకేలకు వైసీపీ అధిష్టానం స్పందించింది. డ్రైవర్ హత్య కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రాగా.. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటంపై కూడా విమర్శలు చెలరేగాయి. ఈ తరుణంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తాజాగా ప్రకటన విడుదల చేసింది. వైసీపీ అధినేత, సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుకు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఈ నెల 19న హత్యకు గురైన విషయం తెలిసిందే. అనంతరం మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి కాకినాడలో ఆయన ఇంటికి సమీపంలో వదిలి వెళ్లారు. దీంతో ఎమ్మల్సీ అనంతబాబుపై ఆరోపణలు వచ్చాయి. అనంతబాబే హత్య చేశాడని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... ప్రాథమిక విచారణలో అనంతబాబు హత్య చేసినట్లు గుర్తించారు.