ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలు ఎలా చెపితే అలా చేసుకుంటూ ముందుకు సాగుతుందా?. తాజాగా చోటు చేసుకున్న వ్యవహారం చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాకమానదు. వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు పలు అనుమానాలకు ..వివాదాలకు తావు ఇస్తున్నాయి. మొదటి నుంచి కూడా ఈ వ్యవహారం అలాగే సాగుతోంది. వైజాగ్ లో డేటా సెంటర్ పెట్టేది గూగుల్ అని చెపుతారు...భూములు అన్నీ కూడా అదానీ గ్రూప్ కంపెనీల మీద కేటాయిస్తారు. అదేంటి అంటే ఇందులో అదానీ తో పాటు మరి కొన్ని కంపెనీలు కూడా భాగస్వాములుగా ఉన్నారు అని ప్రకటించారు. వైజాగ్ డేటా సెంటర్ కోసం అంటూ ప్రభుత్వం భూములు కేటాయించి పూర్తి గా నాలుగు నెలలు కాకముందే ఇందులో మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మూడు చోట్ల ఈ డేటా సెంటర్ల కోసం 480 ఎకరాలు కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
ఈ మొత్తాన్ని ఇప్పుడు 601 ఎకరాలకు పెంచారు. అంటే మొదట చేసిన కేటాయింపులకు ఇప్పుడు చేసిన కేటాయింపులకు మధ్య తేడా 121 ఎకరాలు ఉంది. గూగుల్..అదానీ వంటి కంపెనీలు ఏ మాత్రం అంచనాలు లేకుండా డీపీఆర్ లు ఇచ్చి 480 ఎకరాలకు ముందు ఎందుకు ఒప్పుకున్నాయి...మళ్ళీ ఇప్పుడు ఆ మొత్తం ఎందుకు 601 ఎకరాలకు చేరింది అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. వైజాగ్ లో ప్రభుత్వం పారిశ్రామిక సంస్థలకు చేస్తున్న భూ కేటాయింపులు వివాదాస్పదం అవుతున్న వేళ ఇప్పుడు వైజాగ్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ కోసం భూ కేటాయింపులు పెంచటం దుమారం రేపే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రి వర్గ సమావేశం లో వైజాగ్ డేటా సెంటర్ కు అదనపు భూములు కేటాయించే అంశంపై నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆంధ్ర ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.