ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ లో వైసీపీ బుధవారం నాడు వ్యవహరించిన తీరు ఇది. వైసీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. దీనికి వీళ్ళు చూపుతున్న కారణం జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవటమే. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా వైసీపీ తన వైఖరి మార్చుకోవటం లేదు. అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటూ వస్తోంది. కాకపోతే ప్రతి సారి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యే తోలి రోజు గవర్నర్ ప్రసంగానికి మాత్రం అలా వచ్చి ఇలా వెళుతున్నారు. ఈ సారి కూడా అలాగే చేశారు. బుధవారం నాడు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ కి హాజరు అయ్యారు.
అయితే సభలో కొద్దిసేపు మాత్రమే ఉన్నారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలనే డిమాండ్ తో మరో సారి సభలో నినాదాలు చేశారు. దీంతో పాటు మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో అప్పగించటాన్ని వ్యతిరేకిస్తూ , రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలి అని నినాదాలు చేశారు. సభలో కొద్ది సేపు గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ నినాదాలు చేసిన వైసీపీ సభ్యులు తర్వాత జగన్ తో కలిసి సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా అసెంబ్లీ రిజిస్టర్ లో సంతకాలు చేస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
దీంతో అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇప్పుడు కొత్త విధానం తెర మీదకు తెచ్చారు. రిజిస్టర్ స్థానంలో ముఖ గుర్తింపు హాజరు విధానం ప్రవేశపెట్టారు. దీంతో వాళ్ళు సంతకాలు పెట్టే అవకాశం లేకుండా పోయింది. మరి ఇప్పుడు జగన్ తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా గురువారం నాడు సభకు హాజరు అయి అటెండెన్స్ వేసుకుని వెళతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వరసగా ఆరు నెలలు సభకు హాజరు కాకపోతే ఆ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేయటానికి అవకాశం ఉంది అని స్పీకర్ ...డిప్యూటీ స్పీకర్ లు గతంలో పలు మార్లు ప్రకటించారు. మరో వైపు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా వేతనాలు తీసుకుంటున్నారు అని విమర్శించిన సంగతి తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షం లేవనెత్తిన అంశాలే ఎన్నో ఉన్నాయి. మరి ఇప్పుడు అయినా వీళ్ళు సభకు హాజరు అయి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా లేదా అన్నది చూడాల్సిందే. అసెంబ్లీ కి ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నా కూడా మండలికి మాత్రం ఆ పార్టీ ఎమ్మెల్సీలు హాజరు అవుతూనే ఉన్నారు. ఒక్కో సభకు వైసీపీ ఒక్కో విధానం అనుసరిస్తోంది.