జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూటమి ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అది కూడా బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు మాధవ్ సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేయటం తో ఇది మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కూటమిలో బీజేపీ లేకపోతే రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ కానీ...జనసేన కానీ లేదు అంటూ ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మనమే ప్రధానం అంటూ ఆయన బహిరంగంగానే కుండబద్దలు కొట్టారు. ఎవరైనా మన తర్వాతనే అంటూ ఆయన తన ప్రసంగాన్ని సాగించారు. కాళహస్తి ఆనంద్ అన్నా కూటమి పాలన ఎలా ఉందే అని అడిగాడు. 1983 లో ఎన్టీఆర్ పాలన ఎలా ఉంది అంటే అప్పటిలో గజ్జల మల్లారెడ్డి చాలా కమ్మగా ఉంది అని చెప్పాడు. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది అట్లే. అది పోవాల. కమ్మటి పరిస్థితి. ఒకే కులంలో అందరం పని చేసేవాళ్లకు...ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్లకు అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్ధం అయి ఉంటది ..కమ్మగా ఉండటం అంటే. ఆ కమ్మతో పాటు అందరం ఉండాలి అక్కడ. ఇక్కడా కులాలు..మతాలు కాదు. బీజేపీ నే ఇక్కడ ప్రధానం అన్నారు.
ఆదినారాయణ రెడ్డి కులం వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ముసి ముసి నవ్వులు చిందిస్తూ కూర్చున్నారు. గతంలో ఒక సారి జన సేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తాము నిలబడటమే కాకుండా...నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న టీడీపీ ని కూడా నిలబెట్టాం అని వ్యాఖ్యానించారు. అయినా సరే అధికార టీడీపీ నుంచి స్పందన కరువైంది అప్పటిలో. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అయినా టీడీపీ స్పందిస్తుందా...లేక ఎప్పటిలాగానే చూసీ చూసీ చూడనట్లు వదిలేస్తుందా అన్నది వేచిచూడాల్సిందే. అయితే ఆదినారాయణ రెడ్డి తాజా వ్యాఖ్యల వెనక వేరే ఎజెండా ఉండి ఉంటుంది అనే చర్చ సాగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ఆదినారాయణ రెడ్డి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీ లో చేరి ఏకంగా మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ లో చేరి ఆ పార్టీ నుంచి జమ్మలమడుగు అసెంబ్లీ నుంచి ఎన్నికయ్యారు. ఆయన కు ఉమ్మడి కడప జిల్లాకు చెందిన కొంత మంది బీజేపీ నేతలతో పాటు కొంత మంది టీడీపీ నాయకులతో కూడా విబేధాలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఈ విబేధాలు రచ్చకెక్కాయి కూడా. ఆ సమయంలో కూటమి ప్రభుత్వం ఆయన కు పూర్తి స్థాయి మద్దతు ఇవ్వనందునే ఇప్పుడు చంద్రబాబు కులాన్ని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఉంది అనే చర్చ సాగుతోంది.