విద్యుత్ శాఖతో సహా!

Update: 2026-02-03 13:02 GMT

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో త్వరలోనే కీలక మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్ర ను పూర్తి స్థాయిలో టీటీడీ ఈవో గా నియమించబోతున్నారు. ప్రస్తుతం ఆయన సీఎం ముఖ్యకారదర్శిగా ఉంటూ టీటీడీ ఈఓ అదనపు బాధ్యలు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ బాధ్యత కూడా ఇటీవలే అప్పగించారు. త్వరలోనే ఆయనకు టీటీడీ ఈఓ పూర్తి బాధ్యతలు అప్పగించనున్నారు. అయితే ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే ప్రస్తుతం ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయానంద్ ఈ నెలాఖరుకు రిటైర్ కానున్న విషయం తెలిసిందే. అయితే ఆయన్ను రిటైర్ అయిన వెంటనే ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా అనియమించే అవకాశం ఉంది అని ఐఏఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

                                              అంతే కాదు ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా ఉంటూనే ఆయనకు విద్యుత్ శాఖ పూర్తి బాధ్యతలు కూడా అప్పగిస్తారు అని చెపుతున్నారు. విద్యుత్ తో పాటు ఐటి శాఖ కూడా ఇచ్చే అవకాశం ఉంది అనే చర్చ సాగుతోంది. దీంతో టీటీడీ ఈఓ గా వెళ్లనున్న ముద్దాడ రవిచంద్ర పోస్ట్ ను విడిగా భర్తీ చేయాల్సిన అవసరం లేకుండా ఈ ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్లు చెపుతున్నారు. విజయానంద్ సిఎస్ గా పదవి విరమణ చేసిన తర్వాత కూడా విద్యుత్ శాఖ బాధ్యతలు అప్పగిస్తారు అనే ప్రచారం మొదటి నుంచి ఉంది. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో సీఎం ముఖ్యసలహాదారుగా నియమించి...ఆయనకు విద్యుత్ శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం స్పష్టంగా ఉంది అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

                                              వైసీపీ హయాంలో జగన్ మోహన్ రెడ్డి కూడా మాజీ సిఎస్ అజయ్ కల్లం ను ముఖ్య సలహాదారుగా నియమించుకున్న సంగతి తెలిసిందే. విజయానంద్ రిటైర్మెంట్ తర్వాత సిఎస్ కానున్న సాయి ప్రసాద్ దగ్గర దగ్గర ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉంది అని...ఆ తర్వాత ఆయనకు ఈఆర్ సి చైర్మన్ లేదంటే మరో కీలక పదవి కేటాయించే అవకాశం ఉంది అధికార వర్గాలు చెపుతున్నాయి. టీటీడీ ఈవో గా తప్పించిన అనిల్ కుమార్ సింఘాల్ కు కూడా ఈ బదిలీల సమయంలోనే కొత్త పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది అనే చర్చ కూడా సాగుతోంది. వాస్తవానికి కొద్ది నెలల క్రితం జరిగిన బదిలీల్లోనే సీఎంఓ లో కూడా కీలక మార్పులు చేస్తారు అని ఐఏఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ వివిధ కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు రవిచంద్ర టీటీడీ ఈఓ గా పూర్తి స్థాయిలో వెళ్ళటం ఖాయం అని చెపుతున్నారు.

Tags:    

Similar News