దేశ వ్యాప్తంగా ఇండిగో ఎయిర్ లైన్స్ సర్వీసులు నిలిచిన పోయిన సమయంలో పెద్ద దుమారమే చెలరేగిన విషయం తెలిసిందే. ఈ వివాదం సమయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో రిపబ్లిక్ టీవీ డిబేట్ లో పాల్గొన్న టీడీపీ నాయకుడు దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారానికి మరింత ఆజ్యం పోశాయి. తమ నాయకుడు నారా లోకేష్ వార్ రూమ్ లో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అంటూ ఆయన రిపబ్లిక్ టీవీ లో మాట్లాడారు. దీంతో అర్నాబ్ గోస్వామి అసలు ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కు...పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖకు ఏమి సంబంధం....కేంద్రం పరిధిలోని సమస్యపై రాష్ట్ర మంత్రి ఎలా మానిటర్ చేస్తారు అని ప్రశ్నించటం..ఇది మీడియాలో రావటంతో పెద్ద దుమారమే రేగింది. వాస్తవానికి ఆ సమయంలో నారా లోకేష్ దేశంలోనే లేరు. ఇది అంతా గత వివాదం అయితే..ఇప్పుడు అదే దీపక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు.
లోక్ సభలో ప్రతిపక్షాలకు చెందిన మహిళా ఎంపీల దగ్గర ఎలాంటి ఆయుధాలు లేకపోయినా కూడా వాళ్ళు ప్రధాని నరేంద్ర మోడీ ని కొరికే అవకాశం ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో జాతీయ ఛానెల్ ప్రతినిధి ప్రధాని ని కోరుకుతారా అంటూ ఒకింత అవాక్కు అయి తిరిగి ప్రశ్నిస్తే...అవును వాళ్ళ దగ్గర ఆయుధాలు లేకపోయినా కూడా పళ్ళు ఉన్నాయి కదా అని ఆయన సమాధానం ఇచ్చారు. టైమ్స్ నౌ ఛానెల్ డిబేట్ లో తాజాగా దీపక్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభల నుద్దేశించి రాష్ట్ర పతి ద్రౌపతి ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ లోక్ సభలో సమాధానం ఇవ్వని విషయం తెలిసిందే. దేశ పార్లమెంట్ చరిత్రలో ఇలా జరగటం ఇదే మొదటిసారి అని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే...మహిళా సభ్యులను అడ్డంపెట్టుకుని ప్రధాని పై దాడి చేసేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నట్లు తనకు సమాచారం రావటమే తానే సభకు వద్దు అని ప్రధానికి సూచించినట్లు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది సోషల్ మీడియా లో కూడా పెద్ద ఎత్తున చర్చకు కారణం అయింది. ఏకంగా లోక్ సభ లోనే తనను తాను రక్షించుకోలేని ప్రధాని మోడీ దేశాన్ని రక్షించగలరా అంటూ కొంత మంది ప్రశ్నించారు. లోక్ సభ స్పీకర్ చెప్పిన కారణం ఏ మాత్రం సహేతుకంగా లేదు అనే చర్చ కూడా సాగుతోంది. ఈ తరుణంలో టీడీపీ నాయకుడు దీపక్ రెడ్డి ఏకంగా మహిళా ఎంపీలు ప్రధాని ని కొరికే వాళ్ళు అంటూ జాతీయ మీడియా లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియా లో ఈ క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారింది. అసలు ఏ మాత్రం సంబంధం లేని విషయాలను ప్రస్తావించటం ద్వారా టీడీపీ వివాదాలను కొని తెచ్చుకుంటుంది అని పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.