ఏపీలోని అధికార వైసీపీలో కీలక పరిణామం. సీఎం జగన్ ను వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు వైసీపీ రాజ్యాంగాన్ని సవరించారు. ఈ సవరణలకు పార్టీ ప్లీనరీలో తీర్మానాన్ని ఆమోదించారు. బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి వ్యక్తిగా జగన్ రికార్డులకు ఎక్కారు. రెండేళ్లకు ఒకసారి ప్లీనరీలో సహజంగా అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అలాంటిది ఏమీ లేకుండా ఇక జగన్ వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా నియమించుకున్నారు.
దీంతో ఇక ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉండదన్న మాట. రెండవ రోజు ప్లీనరీలో పలు తీర్మానం ఆమోదం తర్వాత ఈ ఎన్నికకు సంబంధించి తీర్మానాన్ని ఆమోదించారు. తన కష్టంతో పాటు కార్యకర్తల త్యాగాలు, శ్రమ వల్లే ప్రభుత్వం ఏర్పాటైందని జగన్ వ్యాఖ్యానించారు. ఈ మూడేళ్ల పాలనలో సామాజిక, ఆర్ధిక, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో సమూల మార్పులు తీసుకొచ్చామని ప్రకటించారు. మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని తెలిపారు.