రాజధాని రియల్ ఎస్టేట్ అంటూ నియోజకవర్గాల వారీగా జగనన్న టౌన్ షిప్ ల పేరుతో రియల్ దందా
ఎన్నికల అంశంగా మూడు రాజధానులు మార్చుకునే ప్లాన్
అమరావతిపై ఏపీ హైకోర్టు తీర్పు.. ఆ తర్వాత అధికార పార్టీ నేతల వ్యాఖ్యలు చూస్తే అంతిమంగా మరో రెండేళ్ళు కూడా ఏపీ రాజధాని లేకుండానే కొనసాగనుందని విషయం స్పష్టం అవుతోంది. రాజధాని అమరావతిలోనే అంటూ హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత జగన్ సర్కారులో అత్యంత కీలకంగా ఉన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అది ఎలా చేస్తామో మీరే చూస్తారు అంటూ వ్యాఖ్యానించారు. పురపాలక శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణతోపాటు అధికార పార్టీ నేతలు అందరూ అదే మాట తేల్చిచెబుతున్నారు. హైకోర్టు తీర్పుపై సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించినా..మరొకటి జరిగినా ఈ రెండేళ్ళ కాలంలో అమరావతిలో మాత్రం రాజధాని పనులు పెద్దగా ముందుకు పడే సూచనలు అయితే లేవన్నది స్పష్టం అని తేల్చిచెబుతున్నాయి అధికార వర్గాలు. ఇక్కడ పూర్తి స్థాయి రాజధాని ఏర్పాటు అన్నది సీఎం జగన్ కు ఏ మాత్రం ఇష్టం లేదన్నది బహిరంగ రహస్యమే. అందుకే హైకోర్టు చెప్పిన తరహాలో రైతులకు సంబంధించిన పనులు ఏమైనా ఉంటే వాటిని పూర్తి చేస్తారే తప్ప..అమరావతిలో రాజధానికి సంబంధించి పనులు జరగటం కష్టమే అన్నది అధికారులు అంచనా.
అవసరం అయితే మూడు రాజధానుల అంశాన్ని వచ్చే ఎన్నికల ఏజెండాగా మార్చుకుందామనే తరహాలో వైసీపీ నేతలు ఉన్నారు. అయితే ఎన్నికల ఏజెండాగా మార్చుకున్నా...ఎలా చేసినా..హైకోర్టు తీర్పులోని న్యాయపరమైన అంశాల లోతుల్లోకి వెళ్లకుండా రాజకీయ కోణంలోనే నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అంతిమంగా నష్టపోయేది రాష్ట్రమే అని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. రాజధానికి సంబంధించి అధికార వైసీపీ సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చ చేపట్టాలని ప్రతిపాదించింది. అసెంబ్లీలో అధికార పార్టీ ఎలాంటి ప్రకటనలు చేయనుంది అన్నది ఆసక్తికరంగా మారింది. అమరాతిని వైసీపీ మొదటి నుంచి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు అంటూ విమర్శలు గుప్పిస్తోంది. నిజంగా అమరావతి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టే అనుకుందాం కాసేపు.
చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని రాజధాని ప్రాంతానికే పరిమితం చేయగా..ఇప్పుడు జగన్ సర్కారు దీన్ని నియోజకవర్గ వ్యాప్తం చేసింది. ఏపీలోని ప్రతి నియోజకర్గంలో జగనన్నటౌన్ షిప్ ల పేరుతో రాష్ట్రమంతటా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మరి దీన్ని ఏమంటారో. గత ఎన్నికల్లో జగన్ వస్తే రాజధాని మారుస్తాడని చెప్పి చంద్రబాబు ప్రచారం చేశారు. జగన్ తోపాటు వైసీపీ నేతలు అబ్బే అలాంటిదేమీ లేదని చంద్రబాబే అమరావతిలో ఇళ్లు కట్టుకోలేదు..మా నేతే ఇళ్లు, పార్టీ ఆఫీసు కూడా కట్టుకున్నారు ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి అంటూ అప్పట్లో వాదించారు. ఇప్పుడు మూడు రాజధానులపై ప్రజా తీర్పుకు వెళతాం అన్న తరహాలో వైసీపీ నేతలు అంటున్నారు. విభజన జరిగి ఎనిమిదేళ్ళ తర్వాత కూడా ఏపీలో రాజధాని అనిశ్చితి తొలగలేదంటే ఆ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.