రాష్ట్ర చరిత్రలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడూ ఇంత దారుణంగా జరిగిన దాఖలాలు లేవని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితంలో తొలిసారి పంచాయతీ ఎన్నికలపై సమీక్ష చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబు ఆదివారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. బలవంతపు ఏకగ్రీవాలతో లబ్ధిపొందాలని చూశారని, అయితే మంత్రుల స్వగ్రామాల్లో వైసీపీని ఓడించారని చంద్రబాబు తెలిపారు. మంత్రి గౌతంరెడ్డి సొంతూరులో వైసీపీ ఓడిందని, బూతుల మంత్రి సొంతూరులోనూ టీడీపీ గెలిచిందని చంద్రబాబు తెలిపారు. టీడీపీ నేతలపై అధికారులతో అక్రమ కేసులు పెట్టించారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజలు పోరాడారని చంద్రబాబు కొనియాడారు. వైసీపీ ప్రభుత్వ పతనానికి పంచాయతీ ఎన్నికలు నాంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
వైసీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసిందని విమర్శించారు. టీడీపీ నేతలపై అధికారులతో అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. టీడీపీ చొరవ వల్లే 82 శాతం పోలింగ్ జరిగిందన్నారు. 39 శాతం మంది టీడీపీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారని, ఏజెంట్లను బలవంతంగా బయటికి పంపి అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టాలని తాము ఎప్పుడో కోరామని చంద్రబాబు గుర్తు చేశారు. ఎస్‌ఈసీ ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టాలని ఆదేశించిందని.. రెండోవిడత ఎన్నికల్లో ఎన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. వైసీపీ నేతలు అడిగితే వెంటనే రీకౌంటింగ్‌కు అనుమతి ఇచ్చారని.. తెదేపా నేతలు కోరితే మాత్రం రీకౌంటింగ్‌కు అవకాశం ఇవ్వలేదన్నారు.