వైజాగ్ లేదు..విజయవాడ లేదు అంతటా వైసీపీనే

Update: 2021-03-14 11:02 GMT

వైసీపీ ఏకపక్షంగా ఊడ్చేసింది. ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. సహజంగా అధికార పార్టీకే స్థానిక సంస్థల్లో అనుకూలత ఉంటుందనే అభిప్రాయం ఉన్నా..మరీ ఇంత క్లీన్ స్వీప్ అయితే ఊహించని పరిణామమే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అక్కడక్కడ తప్ప..ఈ ఎన్నికల్లో ఎక్కడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఇది ఆ పార్టీకి పెద్ద షాకింగ్ ఫలితాలే అని చెప్పకతప్పదు. జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో అసలు అభివృద్ధి లేదని..అరాచకం పెరిగపోయిందని ప్రచారం చేసిన టీడీపీకి ఈ పలితాలు ఏ మాత్రం మింగుడుపడేవి కావు. వైజాగ్ లేదు...విజయవాడ లేదు...గుంటూరు లేదు..అన్నీ వైసీపీకే. ఫ్యాన్ గాలి జోరులో సైకిల్ కన్పించకుండా కొట్టుకుపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో ఇంతకంటే బిన్నమైన ఫలితాలు ఉంటాయని పెద్దగా ఎవరూ ఊహించలేదు. కాకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చినందున విశాఖ నగర ప్రజలు..అమరావతి అంశం ఉన్నందున విజయవాడ, గుంటూరు ప్రజలు ఏమైనా భిన్నంగా తీర్పు ఇస్తారా? అని మాత్రమే ఎక్కువ మంది ఆసక్తిగా చూశారు. కానీ ప్రాంతం ఏదైనా ఫలితం ఒక్కటే అన్న చందంగా అన్ని చోట్ల వైసీపీ గాలే వీచింది.

మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు మున్సిపాలిటీలు అన్నింటిలోనూ అధికార వైసీపీనే జయకేతనం ఎగరేసింది. ఈ ఫలితాలతో అధికార వైసీపీ సంబరాలు చేసుకుంటుంటే ...ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం డీలాపడిపోయారు. ఎక్కడా ఆ పార్టీ నేతలు కన్పించకుండా పోయారు. కొద్ద రోజుల క్రితం ముగిసిన పంచాతీయ ఎన్నికల్లోనూ ఇదే తరహాలో అధికార వైసీపీ మద్దతుదారులైన అభ్యర్ధులే గెలిచారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే సీన్ రిపిట్ అయింది. ఈ లెక్కన త్వరలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఊహించటం పెద్ద కష్టం కాబోదు. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీని మాత్రం తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది.

Tags:    

Similar News