కడప స్టీల్ భాగస్వాముల కోసం ఆర్ఎఫ్ పీ జారీ

Update: 2020-11-13 09:08 GMT

చట్టబద్ద హక్కును పొందటంలో చంద్రబాబు, జగన్ ఇద్దరూ విఫలం

ఏపీ సర్కారు కడప జిల్లాలో నెలకొల్పనున్న వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ కు భాగస్వాములను ఆహ్వానిస్తోంది. ఈ స్టీల్ ప్లాంట్ ను జాయింట్ వెంచర్ కింద ఏర్పాటు చేయాలని సర్కారు తలపెట్టింది. దీనికి ఆసక్తి ఉన్న సంస్థలను ఆహ్వానిస్తూ గ్లోబల్ టెండర్లు జారీ చేశారు. ఆసక్తి ఉన్న సంస్థలు రిక్వెస్ట్ ఫర్ ప్రపొజల్ (ఆర్ఎఫ్ పీ) సమర్పించాల్సి ఉంటుంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఏటా 30 లక్షల టన్నుల సామర్ధ్యంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని తలపెట్టారు. ఈ ప్రాజెక్టు కోసం ఎలాంటి వివాదాలు లేని 3500 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని..దీంతోపాటు ఏటా 2 టీఎంసీల నీరు, నిరంతరాయ విద్యుత్ సరఫరా, నాలుగు లైన్ల రోడ్డుతోపాటు రైలు కనెక్టివిటి ఉందని పేర్కొన్నారు. దీంతోపాటు క్రిష్టపట్నం, రామాయపట్నం ఓడరేవులు, ముడి సరుకు అందుబాటులో ఉన్న ప్రాంతాలు కూడా ఈయూనిట్ ప్రతిపాదిత ప్రాంతానికి చేరువలో ఉంటాయన్నారు.

వాస్తవానికి విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వమే వెనకబడిన రాయలసీమలో ఉన్న కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. చట్టబద్ధంగా కేంద్రంతో పోరాడి సాధించుకోవాల్సిన స్టీల్ ప్లాంట్ విషయంలో గత చంద్రబాబు ప్రభుత్వంతో పాటు ఇప్పుడు జగన్ ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. కేంద్రం చేయాల్సిన పనిని..ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే తన చేతి చమురు వదుల్చుకుంటూ ప్రైవేట్ భాగస్వాములతో చేసేందకు రెడీ అవుతోంది. అయితే ఈ తరుణంలో ఏ సంస్థలు ముందుకొస్తాయి..ఈ ప్రాజెక్టు ఎంత కాలంలో పూర్తి చేస్తారో వేచిచూడాల్సిందే. ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ నేతలు అందరూ చంద్రబాబు కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కు కేంద్రాన్ని ఒప్పించటంలో విఫలమయ్యారని విమర్శించారు. తీరా జగన్ సీఎం అయిన తర్వాత కూడా కేంద్రాన్ని ఒప్పించటంలో విఫలమయ్యారు.

Tags:    

Similar News