
ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప అసెంబ్లీ కి హాజరు కాను అని ప్రకటించిన నాయకుడు బహుశా దేశంలో ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే అయి ఉంటారు. రకరకాల కారణాలతో కీలక నేతలు అసెంబ్లీలోకి అడుగుపెట్టని సందర్భాలు గతంలో ఉన్నా ...ఇలాంటి కారణంతో సభకు దూరంగా ఉన్న నాయకుడు మాత్రం జగన్ మాత్రమే అని చెప్పాలి. అసెంబ్లీ కి దూరంగా ఉండటానికి జగన్ చెప్పిన కారణాలు ఏ మాత్రం సహేతుకంగా లేవు అనే అభిప్రాయాన్ని కొంత మంది జగన్ మద్దతుదారులు కూడా బహిరంగంగానే వ్యక్తం చేశారు. బయట పెద్ద పెద్ద మాటలు చెప్పే జగన్ మోహన్ రెడ్డి మాత్రం సభ్యత్వం పోకుండా ఉండేందుకు అని..బడ్జెట్ సమావేశాల తొలి రోజు ..గవర్నర్ ప్రసంగం ఉండటంతో సభకు హాజరు అయి ..సంతకం పెట్టి వెళ్లారు. తర్వాత మళ్ళీ ఆయన సభ వైపు చూడలేదు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గురువారం నాడు సభలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘వైసీపీ సభ్యులు కొంత మంది దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళ్తున్నారు. ప్రజాస్వామ్యంలో అది సమంజసం కాదు. దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టాల్సిన అవసరమేంటి? మీరు ఎమ్మెల్యేలు, దర్జాగా రండి. రిజిస్టర్ లో సంతకాలు పెట్టి సభలో కనిపించడంలేదు. వైసీపీ సభ్యుల తీరు దురదృష్టకరం. రిజిస్టర్ లో సంతకాలు చేసి సభలో కనిపించని ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. నాకు ఉన్న సమాచారం ప్రకారం ఇలా చేస్తున్న వాళ్ళు వై.బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, విరూపాక్షి, దాసరి సుధ, అమరనాధరెడ్డి, విశ్వేశ్వరరాజులు. మీకు ఓట్లేసిన ప్రజలకు ఇలా చేసి తలవంపులు తేవద్దని కోరుతున్నాం ’ అంటూ స్పీకర్ ప్రకటించటం పెద్ద సంచలనంగా మారింది.
అయితే వీళ్ళు అంతా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలకు భిన్నంగా ఇలా చేస్తున్నారా లేక ఈ విషయంలో ఆయన కు సమాచారం ఇచ్చే చేస్తున్నారా అన్న చర్చ కూడా తెర మీదకు వచ్చింది. ప్రజా సమస్యలపై ప్రశ్నలు వేస్తున్న వాళ్ళు సభకు మాత్రం హాజరు కావటం లేదు అన్నారు. దీని వల్ల ఇతర సభ్యులకు అన్యాయం జరుగుతోంది అన్నారు అయ్యన్న పాత్రుడు. మొత్తానికి అయ్యన్న పాత్రుడు అధికారికంగా సభలో చేసిన ప్రకటన వైసీపీ కి మరింత నష్టం చేసే అంశంగానే చెప్పాలి. గవర్నర్ ప్రసంగం తర్వాత వేర్వేరు రోజుల్లో ఇలా సంతకాలు చేసివెళ్లినట్లు తెలిసింది అన్నారు. ఇలా సంతకాలు చేసిన వాళ్ళు మీకు ఎక్కడైనా సభలో కనిపించారు అని ఆయన ఎమ్మెల్యేలను ప్రశ్నించారు.