ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ వైజాగ్ లో ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్ట్ ను హైదరాబాద్ కేంద్రంగా హెచ్ఎంటివీ ఛానల్ తో పాటు హన్స్ ఇండియా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ను నడుపుతున్న కె. వామన రావు కు చెందిన కంపెనీకి కేటాయిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అద్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సహక బోర్డు (ఎస్ఐపీబి) సమావేశంలో ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వామన రావు డైరెక్టర్ గా ఉన్న బివిఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వైజాగ్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటు చేయబోతుంది అని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ కంపెనీ 1250 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ ను అమలు చేయనుంది. అయితే ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు ప్రభుత్వం ఎంత భూమిని కేటాయించనుంది...ఎంత రేట్ కు అన్న విషయాలు ఇంకా బహిర్గతం కావాల్సి ఉంది. బివిఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ లో కృష్ణయ్య వద్దనపు ఎండీగా ఉన్నారు.
ఈ కంపెనీ హైదరాబాద్ తో పాటు వైజాగ్ లో కూడా వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ ను డెవలప్ చేయబోతున్నట్లు మూడేళ్ళ క్రితమే ప్రకటించింది. దేశంలోనే అతి పెద్ద వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రాజెక్ట్ ను అరవై ఎకరాల్లో శంషాబాద్ లో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు గతంలోనే. వైజాగ్ లో రుషికొండ హిల్స్ పై వరల్డ్ ట్రేడ్ సెంటర్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు అప్పటిలోనే తెలిపారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మాత్రం ఎండాడ లో ఈ ప్రాజెక్ట్ రానున్నట్లు వెల్లడించింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ద్వారా పదిహేను వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు.
దీంతో పాటు బుధవారం నాడు జరిగిన ఎస్ఐపీబి లో సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసే డేటా కు కూడా ఓకే చేశారు. ఈ కంపెనీ మొదటిదశలో 1,466 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. రెండవదశలో రూ.15,000 కోట్ల పెట్టుబడులు... 400 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి అని ప్రభుత్వం వెల్లడించింది. అంతే కాకుండా సత్వ డెవలపర్స్ సంస్థ విశాఖ మధురవాడలో చేపట్టనున్న ప్రాజెక్ట్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ కంపెనీ 1500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 25వేల ఉద్యోగాలు వస్తాయని చెపుతున్నారు. ఎఎన్ఎస్ఆర్ సంస్థ 1000కోట్ల రూపాయల పెట్టుబడితో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జిసిసి)ని ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిపాదనకు కూడా ఆమోదం దక్కింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 10వేలమంది ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా.