ఎక్కడో లెక్క తేడా కొడుతోంది. వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏ బహిరంగ సభలో అయినా ఒకటే మాట చెపుతున్నారు..చంద్రబాబు హయాంలో ఇదే బడ్జెట్..ఇప్పుడు కూడా అదే బడ్జెట్..కానీ చంద్రబాబు కంటే తాను ఎక్కువగా ప్రజలకు మేలు చేస్తున్నానని చెపుతూ పోతున్నారు. మీకు మేలు జరిగిందా లేదా ఆలోచించాలని ప్రజలను కోరుతున్నారు. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు వివిధ పధకాల కింద ప్రజలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటి) కింద ఏకంగా రెండు లక్షల కోట్ల రూపాయల మేర ప్రజలకు అంధ చేశారు. సీఎం జగన్, వైసీపీ కూడా వచ్చే ఎన్నికల్లో ఇదే తమను గెలిపిస్తుంది అనే ధీమాతో ఉన్నారు. కానీ గత కొంత కాలంగా జరుగుతున్న సీఎం జగన్ సభలు...ఆ సభల నుంచి ప్రజలు బయటకు వెళుతున్న తీరు చూస్తూ జగన్ చెపుతున్న డీ బీటి తమను నిజంగానే కాపాడుతుందా లేదా అనే అనుమానాలు వైసీపీ నేతల్లో కూడా వ్యక్తం అవుతున్నాయి. సహజంగా ముఖ్యమంత్రుల సమావేశంలో బారికేడ్స్ పెడతారు. కానీ మీటింగ్ కు హాజరు అయిన ప్రజలు మధ్యలో వెళ్లిపోకుండా పెట్టే పరిస్థితి ఎప్పుడూ ఉండదు. కానీ గత కొంతకాలంగా సీఎం జగన్ సభల నుంచి ప్రజలు మధ్యలోనే పరారు అవుతుండటంతో ఇప్పుడు పలు అంచెల్లో బారికేడ్స్ పెట్టడం తీవ్ర చర్చనీయాంశగా మారింది.
అయినా సరే ప్రజలు వాటిని కూడా ఛేదించుకుని బయటకు వెళుతున్నారు అంటే ఇది ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపుతుంది అనే భయం వైసీపీ నేతల్లో వ్యక్తం అవుతోంది. నవరత్నాల పేరుతో ఇతర అంశాలను వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది అనే విమర్శలు ఉన్నాయి. పైగా రహదారులతో పాటు ఇతర కనీస సౌకర్యాలను అడిగిన ప్రజలను వివిధ స్కీంల కింద నిధులు తీసుకుంటున్నారుగా అన్ని ఒకే సారి ఎలా వస్తాయి అంటూ ప్రజలనే ఎదురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పరంగా ప్రజలకు కల్పించాల్సిన వసతుల సంగతి పక్కన పెట్టి మేము ఇచ్చేవి తీసుకోండి...ఇక మమ్ముల్ని ఏమి అడగకండి అన్నట్లు ఉంది వైసీపీ నేతల తీరు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించిన తరుణంలో ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ..ఏకంగా సీఎం జగన్ సభల నుంచే ప్రజలు పారిపోతున్నారు అనే మెసేజ్ వెళితే భారీ నష్టం తప్పదనే భయం వైసీపీ నేతల్లో ఉంది.